పవన్ పోటీ చేయాలనుకుంటున్న చోట జగన్...?

Update: 2017-12-23 01:30 GMT

వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది. ఈరోజు జగన్ పుట్టపర్తి నియోజవర్గం నుంచి కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. కదిరి నియోజకవర్గం వాస్తవానికి గత ఎన్నికల్లో వైసీపీదే. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చాంద్ పాషా టీడీపీ అభ్యర్ధి కందికుంట వెంకట ప్రసాద్ పై విజయం సాధించారు. అయితే చాంద్ పాషా కొంతకాలం క్రితం టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పార్టీని వీడి టీడీపీలోకి వెళ్లారు. దీంతో కదిరి నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.

కదరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం...

ఇక కదిరి నియోజకవర్గానికి మరో విశిష్టత ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కాని అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గం నుంచే పవన్ పోటీ చేస్తారన్న టాక్ బలంగా విన్పిస్తుంది. పవన్ కల్యాణ్ కు కదిరి సెంటిమెంట్ కూడా ఉందంటున్నారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న కదిరి నియోజకవర్గంలో ఈరోజు పాదయాత్ర జరుగుతుండటం విశేషం.

జగన్ యాత్రకు అంతా సిద్ధం....

ఇక 42వరోజు పాదయాత్ర బుక్కపట్నం మండలం బొగ్గాలపల్లి నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత ఉదయం 8.30గంటల ప్రాంతంలో కదిరి నియోజకవర్గం చేరుకుంటుంది. కదిరి నియోజకవర్గంలోని యాకాల చెరువు కొత్తపల్లి, కొండమనాయుని పల్లి, వరిగిరెడ్డి పల్లి, గట్లు క్రాస్ రోడ్స్, పార్ధసారధి కాలనీ నుంచి జగన్ పాదయాత్ర కొనసాగనుంది. అక్కడే జగన్ మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. తర్వాత వీవర్స్ కాలనీ నుంచి కోనేరు సర్కిల్, క్లాక్ టవర్ సర్కిల్, ఇందిరాసర్కిల్ కు జగన్ యాత్ర చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. కదిరిలో జగన్ పాదయాత్ర విజయవంతం చేసేందుకు వైసీపీ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇటు పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పేవిధంగా యాత్ర సాగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Similar News