ఆయన వైసీపీ ఎమ్మెల్యే. కాని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని. ఈయన జనసేన పార్టీలోకి వెళతారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన తన అభిమాన నటుడిపై నిప్పులు చెరిగారు. ఆయనే నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. అనిల్ కుమార్ యాదవ్ చిన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. అయితే గత నాలుగు రోజుల నుంచి వైసీపీ, జగన్ లపై పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. తన అభిమాన హీరో ఇంత చవటని తాను అనుకోలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు కష్టం వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ దిగిపోతారన్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న జగన్ పై ఆయన ఎందుకు మండిపడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తుంటే అది పవన్ కు కనపడలేదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ విరుద్ధమని తెలిసిన పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదన్నారు. పవన్ కేవలం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. జాతీయ మీడియా సయితం ఏపీలో అవినీతిని బయటపెడుతుంటే పవన్ కు మాత్రం అది పట్టడం లేదన్నారు.