పవన్ పరుగులు పెట్టిస్తున్నారే...!

Update: 2017-10-29 05:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీర్ఘకాలం రాజకీయాలను నడిపేందుకు సిద్ధమయ్యారు. తన అన్న చిరంజీవి మాదిరిగా ప్రజారాజ్యం పార్టీ తరహాలో కాకుండా జనసేనను విన్నూత్న తరహాలో ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలను ప్రారంభించారు. త్వరలోనే ఆన్ లైన్ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టబోతున్నారు. వచ్చే నెలలోనే ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్న పవన్ కల్యాణ్ తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటున్నారు. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయాన్ని పూర్తి హంగులతో ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఇక జిల్లాలు, రెండు రాజధానులపైనా దృష్టి పెట్టారు.

అన్ని చోట్ల పార్టీ కార్యాలయాలు.....

ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు జనసేనాని ఆదేశించారు. హైదరాబాద్, అమరావతి నగరాల్లో ఐదు ఎకరాల్లో జనసేన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే తెలంగాణలోని పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనూ, ఏపీలోని 13 జిల్లా కేంద్రాల్లోనూ రెండు ఎకరాల్లో పార్టీ ఆఫీసులను నిర్మించేందుకు పవన్ రెడీ అయ్యారు. ఈ మేరకు కసరత్తులు చేస్తున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాలు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలను తనకు సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులకు అప్పగించినట్లు తెలుస్తోంది. వెంటనే భూ సేకరణ జరిపి పార్టీ కార్యాలయాలను నిర్మించాల్సిందిగా జనసేనాని ఆదేశించడంతో పవన్ పార్టీ కార్యకర్తల్తో ఉత్సాహం నెలకొంది. కార్యాలయ నిర్వహణకు కూడా విధివిధానాలను రూపొందించాలని పవన్ ఆదేశించారు.

Similar News