పవన్ నోట జై తెలంగాణ మాట....!

Update: 2018-01-23 07:30 GMT

‘‘ఆంధ్రప్రదేశ్ నాకు జన్మనిస్తే, తెలంగాణ నాకు పునర్జన్మ నిచ్చింది. పూర్తి స్థాయి రాజకీయాల్లో వస్తున్నప్పుడుకొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం నావిధి. నాకు పునర్జన్మ నిచ్చిన తెలంగాణకు ఎప్పుడూ రుణ పడి ఉంటాను. జై తెలంగాణ అన్న పదం నాకు ఇష్టం. వందేమాతరం ఎలాంటిదో జై తెలంగాణ కూడా అలాంటిదే. దేశమంతా స్వాతంత్ర్యం వచ్చినా సరే తెలంగాణకు స్వాతంత్ర్యం రాలేదు. ఆ చీకటిని స్వేచ్ఛ కోసం పరితపించే నినాదమే జై తెలంగాణ. అలాంటి తెలంగాణ నుంచి నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది. ఇది నాకు ఆనందం కల్గించే విషయం. రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన యువతకు స్థానం కల్పించాలన్నదే తన ఉద్దేశం’’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరీనంగర్ లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ ఆవేశంగా ప్రసంగించారు.

మార్చి 14న వివరిస్తా....

మార్చి 14న జనసేన ఆవిర్భవం రోజు పార్టీ గురించి పూర్తి ప్రణాళికను వివరిస్తానని పవన్ చెప్పారు. జనసేన పార్టీ సిద్ధాంతాలేంటి? దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి. ఏ పార్టీ కూడా సిద్ధాంతాలు లేకుండా ముందుకెళ్లదు అనే విషయాలపై ఆరోజే చెబుతానన్నారు. జనసేనకు ఏడు సిద్ధాంతాలున్నాయని, కులాలు, మతాలు ప్రస్తావన ఉండకూడదని, భాషను గౌరవించాలి. సంస్కృతిని కాపాడాలి. అవినీతి రాజకీయాలపై అలుపెరగని పోరాటం. పర్యావరణ పరంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పవన్ సూచించారు. కేసీఆర్ ను స్మార్ట్ సీఎం అంటే కొందరు నేతలకు ఇబ్బంది కలిగిందన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తనను విమర్శించారన్నారు. తన అన్న చిరంజీవి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఆంధ్ర కవులను, కళాకారులను పిలవడం లేదని తనకు మెసేజ్ లు వచ్చాయన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి చెప్పాలనుకున్నాను. తెలంగాణ కవులు, కళాకారులను గౌరవించడమంటే మరొకరిని కించపర్చడం కాదన్నారు. తాను ఎక్కువగా జీవితంలో ఉంది తెలంగాణలోనేనన్నారు. తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టం..ప్రేమ అన్నారు. అభివృద్ధి కోసం ఎవరితోనైనా విభేదిస్తాననని, గొడవ పడతానని చెప్పారు. అదే తన ఆఖరి అస్త్రంగా ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణలో కూడా పోటీ.....

ప్రాంతీయ వాదాన్ని విస్మరించని జాతీయ వాదమే జనసేన లక్ష్యమని వివరించారు. తెలంగాణను స్ఫూర్తి తీసుకుని కొత్త రాష్ట్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుందన్నారు. మతాల ప్రస్తావన లేని రాజకీయమే జనసేన లక్ష్యమన్నారు. సామాజిక న్యాయమంటే కేవలం సీట్లు ఇవ్వడమే కాదని, అందరూ అభివృద్ధి చెందాలన్నారు. అందరికీ ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. మీ కోసం.. మీ బాధల కోసం తానున్నానన్నారు. పాతిక సంవత్సరాల యుద్ధం కోసం మీరంతా సిద్ధంగా ఉండాలన్నారు. మాట ఇచ్చానంటే మడమ వెనక్కు తిప్పనని పవన్ ఉద్వేగంగా చెప్పారు. 2019 ఎన్నికల్లో జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందన్నారు. జనసేన ఆకాంక్ష తెలంగాణ యువత, ఆడపడచుల ఆకాంక్ష అని చెప్పారు. బలాబలాలను తెలుసుకుందామన్నారు. శక్తి, స్థాయిని తెలుసుకుని 2019 ఎన్నికలకు సిద్ధమవుదామని జనసైనికులకు పిలుపు నిచ్చారు. తనకు పునర్జన్మ నిచ్చిన తెలంగాణ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదన్నారు. కాని తన పోరాటమంతా తెలంగాణ కోసం ఎందుకు యుద్ధం జరిగిందో అది నెరవెరేంత వరకూ ప్రజల పక్షానే ఉంటానన్నారు.

Similar News