పవన్ ను ఫాలో అవుతున్న కమల్....!

Update: 2018-01-24 17:30 GMT

గెలుపోటములను పక్కన పెడితే తమిళనాడు రాజకీయాల్లో విలక్షణ నటుడు కమల్ హాసన్ చాలా సీరియస్ గానే ఉన్నారు. ఆయన ప్రతి రోజూ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను తమ పరం చేసుకునేందుకు ఇటు కమల్ హాసన్, అటు రజనీకాంత్ ఇద్దరూ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటి వరకూ సినిమాల్లో అలరించిన వీరిద్దరూ ఇకపై రాజకీయ చిత్రంపై ప్రజలను ఆకట్టుకోనున్నారు. ఇందులో రజనీకాంత్ కన్నా కమల్ ఒక్క అడుగు ముందే ఉన్నారు.

వచ్చే నెల 21 నుంచి....

కమల్ హాసన్ వచ్చేనెల 21వ తేదీనుంచి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు పార్టీని కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ తన పర్యటనకు, పార్టీకి సంబంధించి చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆళ్వారుపేటలోని కమల్ నివాసం ఇప్పుడు ముఖ్యమైన అనుచరులు, అభిమానులతో కిటకిటలాడుతోంది. అయితేకమల్ కూడా తాను అధికారం కోసం పార్టీ పెట్టడం లేదంటున్నారు. ఏపీలో పవన్ మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తాను పార్టీ పెడుతున్నానని చెబుతున్నారు.

అధికారంలోకి రావడం ముఖ్యం కాదంటూ.....

అయితే కమల్ అచ్చం పవన్ లాగానే ఆలోచన చేస్తున్నారు. తనను ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్నది తాను ఆలోచించడం లేదని చెబుతున్నారు. తన యాత్ర కూడా విజయవంతం అవుతుందా? లేదా? అన్నది కూడా తన మనస్సులో లేదన్నారు. కాని ప్రజా సమస్యలను నేరుగా చూసేందుకే ప్రజల్లోకి వెళుతున్నానని చెప్పారు. కమల్ పర్యటన ఆయన పుట్టిన ప్రాంతం రామనాధపురం నుంచి ప్రారంభం కానుంది. మధురై, శివగంగై జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. అభిమానులు కూడా ఎటువంటి హడావిడి చేయవద్దని కమల్ చెబుతున్నారు. తాను కేవలం ప్రజలను కలిసేందుకే వస్తున్నానని, ఎటువంటి పోస్టర్లు ఏర్పాటు చేయవద్దని కమల్ సూచించారు. మొత్తం మీద కమల్ ను చూస్తుంటే పవన్ ను ఫాలో అవుతున్నట్లే కన్పిస్తుంది. ఏపీలోనూ పవన్ కల్యాణ్ అధికారం తనకు అవసరం లేదంటున్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నించడానికే తాను రాజీకీయ పార్టీని చెప్పానన్నారు. ఆయన కూడా జనంలో తిరుగుతున్నారు. మరి కమల్ కూడా అలానే తమిళనాడులో ప్లాన్ చేసుెకుంటున్నారు. మరి తమిళ తంబిలు కమల్ ను ఆదరిస్తారో లేదో చూడాలి.

Similar News