పవన్ నివేదిక రెడీ... అందులో ఏముంది?

Update: 2018-02-24 00:30 GMT

పవన్ కల్యాణ్ నియమించిన జేఎఫ్ సి తన నివేదికను సిద్ధం చేసింది. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మరో రెండు రోజుల్లో పవన్ కల్యాణ్ కు నివేదికను ఇవ్వనుంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. వారం రోజుల్లో ఏపీ, కేంద్రం లెక్కలను జేఎఫ్ సి తేలుస్తుందని పవన్ కల్యాణ్ అప్పుడు ప్రకటించారు. తొలిరోజు మేధావులు, మరుసటి రోజు నిపుణులు జరిపిన చర్చలు ఏమయ్యాయి? ఆ నివేదిక అసలు రూపుదాల్చిందా? ఒక వేళ నివేదిక వచ్చినా ఆలస్యమెందుకు ఇవీ పలువురి వ్యాఖ్యలు. అయితే నివేదిక సిద్ధమైంది. రెండో రోజుల్లో పవన్ కల్యాణ్ కు చేరనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రెండు రోజుల సమావేశాలు....

ఏపీకి నాలుగేళ్లుగా జరుగుతున్న అన్యాయంపై జనసేనాని పవన్ కల్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లతో పాటు ఎమ్మెల్సీ నాగేశ్వర్, చలసాని శ్రీనివాస్, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, మధు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తొలిరోజు సమావేశంలో వీరు ఆంధ్రకు ఏమి రావాలన్నది చర్చించారు. రెండోరోజు సమావేశంలో లెక్కలు తేల్చేందుకు సాంకేతిక కమిటీని నియమించారు. ఇందులో మాజీ హోంశాఖ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, మరో మాజీ ఐఏఎస్ చంద్రశేఖర్ లు ఉన్నారు. ఈ సమావేశం ముగిసి వారం రోజులు గడిచిపోయాయి. దీంతో నిపుణులు నివేదికను రెడీ చేసినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి.

రెండు రోజుల్లో నివేదిక పవన్ కు...

అయితే అందుతున్న సమాచారం ప్రకారం నిపుణులు లెక్కలు తేల్చి నివేదికను జనసేనానికి రెండు రోజుల్లో ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల లెక్కలతో పాటు ఎవరి నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రానికి ఈ పరిస్థితి ఏర్పడిందన్నది కూడా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదికలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక హదాకు బదులు ప్యాకేజీని కేంద్రం ప్రకటించినప్పుడు ఏపీ సర్కార్ ఎందుకు అంగీకారం తెలపవలసి వచ్చిందో కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. అలాగే కేంద్రం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉపయోగించింది? దానికి కేంద్రం తెలుపుతున్న అభ్యంతరాలను కూడా ఇందులో పొందుపర్చారని జేఎఫ్ సి వర్గాలు వెల్లడించాయి.

పార్లమెంటు సమావేశాలు ప్రారంభంలోపే....

పార్లమెంటు సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈలోపే నివేదికను ప్రజల ముందుంచాలని పవన్ భావిస్తున్నారు. ముందుగా నివేదికపై పవన్ కల్యాణ్, ఉండవల్లి, జేపీలు కలిసి చర్చిస్తారు. నివేదికను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ప్రజల ముందుంచాలని పవన్ భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కంటే ముందుగానే నివేదికను బయటపెట్టి ఆందోళన బాట పట్టాలన్నది పవన్ ప్రయత్నంగా ఉంది. నివేదికలోని అంశాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలు పోరాటబాట బట్టే అవకాశముంది. సో...జేఎఫ్ సి నివేదిక రెడీ ఉందన్న మాట.

.

Similar News