పవన్ టార్గెట్ లో ఈ టీడీపీ నేత...!

Update: 2017-12-07 05:30 GMT

ప్రజారాజ్యం పార్టీలో కీలక భూమిక వహించారు డాక్టర్ పరకాల ప్రభాకర్. ఎన్నికలు దగ్గర పడి పార్టీ టికెట్లు ఇచ్చే సమయంలో ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీ కేంద్ర కార్యాలయంలోనే డాక్టర్ పరకాల ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ ఒక విషవృక్షం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసి జంప్ అయిపోయారు. ఇలాంటి ఝలక్ లు మెగాస్టార్ కి అన్ని ఇన్ని కావు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ సలహాదారుగా బాబు తలలో నాలుక లా వ్యవహరిస్తున్న డాక్టర్ పరకాలను వదిలేది లేదంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నాడు అన్నయ్యకు ద్రోహం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదంటూ తన కసిని కోపాన్ని ప్రదర్శించారు పవన్.

పరకాల కోసం ఎప్పుడు ఎక్కడ చెబుతారు పవన్ ...?

డాక్టర్ పరకాల కోసం ఇప్పుడు కాదు తరువాత మాట్లాడుతా అంటూ విశాఖలో దాటవేశారు పవర్ స్టార్. ఆయన కోసం ఈయన ఎప్పుడు ఎక్కడ ఏమి చెప్పనున్నారు అన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది. ఒక వేళ ప్రజారాజ్యానికి దెబ్బ కొట్టిన వారి కోసం పవన్ చెప్పినా ఇప్పుడు లాభం ఏమిటన్న ప్రశ్న లు విశ్లేషకులు చేస్తున్నారు. చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్లు రాజకీయాల్లో ఇలాంటివి వుంటాయని చెబుతూనే గత చేదు అనుభవాలకు కారణం అయినవారిని వదిలిపెట్టమని పవన్ చెప్పడం చిత్రంగా ఉందంటున్నారు. జనసేన ఆశయాలు, లక్ష్యాలు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్లడం మంచిదని దశాబ్దకాలం క్రితం అన్న పార్టీలో జరిగినవాటికి తమ్ముడు ఇప్పుడొచ్చి తొడ కొట్టడాన్ని అభిమానులు ఆస్వాదించినా రాజకీయ ఆసక్తి వున్న వారు తప్పుపడుతున్నారు.

Similar News