గుజరాత్ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రధాని తన స్థాయి తగ్గించుకు మరీ ప్రచారం సాగించారని ఇక బిజెపికి కౌంట్ డౌన్ ప్రారంభం అయినట్లేనని విశ్లేషించారు అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష కుమార్. తెలుగు పోస్ట్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హర్ష కుమార్ తాజా రాజకీయ పరిస్థితులను విశ్లేషించారు. అనేక అనైతిక చర్యలకు ఈ ఎన్నికల్లో బిజెపి పాల్పడిందని ఆ పార్టీ గెలిచినా గతంతో పోల్చితే ప్రజా వ్యతిరేకత స్పష్టం గా కనిపించిందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ పాకిస్థాన్ తో చెయ్యి కలిపారంటూ ఇలా అనేక దారుణమైన ఆరోపణలతో మోడీ అధర్మ యుద్ధం సాగించాలిసి వచ్చిందని వ్యాఖ్యానించారు హర్ష కుమార్. నోట్ల రద్దు, జీఎస్టీ ల ప్రభావం వల్లే బిజెపికి సీట్లు గణనీయంగా తగ్గిపోయాయన్నది తేలిందన్నారు. 2014 ఎన్నికల్లో వున్న మోడీ ప్రభంజనం నేడు మసకబారిందని విశ్లేషించారు. మోడీ పాలనలో సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాహుల్ గాంధీ చాలా పరిణతి సాధించారన్నారు.
ముస్లిం ఓటర్లు వున్న చోట ....
బాబ్రీ మసీద్ విధ్వంసం జరిగాక భారతీయ జనతాపార్టీకి ముస్లిం ఓటర్లు పూర్తిగా దూరం అయ్యారని కానీ చిత్రంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం అత్యధికంగా వున్న చోటే ఎక్కువ సీట్లు సాధించడం పై ఎన్నికల సంఘం విచారణ జరపాలని హర్ష కుమార్ డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఆ ప్రాంతాల్లోనే ఈవీఎం ల ట్యాపరింగ్ లకు బిజెపి పాల్పడుతుందన్న అనుమానాలను హర్ష కుమార్ వ్యక్తం చేశారు. ఇలా చేయడం ద్వారా ముస్లిం లు మా ప్రభుత్వానికి మద్దత్తు ఉన్నారనే ప్రచారం సాగిస్తున్నట్లు హర్ష ఆరోపించారు. ఈ అంశంపై దేశవ్యాప్త చర్చ కూడా జరగాలన్నారు.
దక్షిణాదిన బిజెపికి అంత సీన్ లేదు ...
ఉత్తరాదిన హడావిడి చేసినా దక్షిణాది ప్రజలు బిజెపి పట్ల తొలినుంచి సానుకూలంగా లేరని హర్ష అన్నారు. తెలంగాణ, ఏపీ , తమిళనాడు, కేరళ, కర్ణాటకలో బిజెపి మనుగడ కష్టమని విశ్లేషించారు మాజీ ఎంపీ. తమిళనాడులో అక్కడి ప్రభుత్వాన్ని చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి బిజెపి చేసిన చేసిన కుట్రలు దేశమంతా చూశారని అయినా దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆదరణ ఉండబోదన్నారు. దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక గాలి ప్రారంభం అయిందని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏ శక్తి బిజెపి పరాజయాన్ని అడ్డుకోలేదన్నారు హర్ష కుమార్.
చిరు లేకుండా పవన్ ...
ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సినిమా లేదన్నారు హర్ష కుమార్. చిరంజీవి కన్నా పవన్ మొనగాడేమీ కాదన్నారు. ఆయనకు క్లారిటీ లేదన్నారు. జనసేన పార్టీ కి అధికారం లక్ష్యం కాదన్నప్పుడు రాజకీయాల్లో ప్రజా సేవ కానీ సమస్యలు కానీ ఎలా తీరుస్తారో చెప్పాలన్నారు. గత ఎన్నికల్లో రెండు మూడు శాతం ఓట్లు పవన్ వల్ల పడ్డాయని టిడిపి, బిజెపి విజయంలో ఆయన పాత్ర ఉందని హర్ష కుమార్ చెబుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం నామమాత్రమేనన్నారు. మెగా స్టార్ చిరంజీవి లేనిదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు మాజీ ఎంపీ హర్ష కుమార్.