ప్రత్యేక హోదాపై రాష్ట్రం అట్టుడికిపోతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లారు? ఉగాది పండగ వరకూవిజయవాడలోనే ఉన్న పవన్ కల్యాణ్ తర్వాత మళ్లీ కన్పించకుండా పోయారు. ఆయన పార్ట్ టైం పొలీటిషయన్ అన్న విమర్శను నిజం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కొన్ని రోజులు హడావిడి చేయడం, అవతలి వారిపై విమర్శలు చేయడం ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం ఇదీ పవన్ వ్యవహారమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆవేశంతో మైకు ముందు మాట్లాడటం... ఆ తర్వాత ఆ మాటకు కట్టుబడి ఉండకపోవడం పవన్ నైజం అన్న విమర్శలు గట్టిగా వినపడుతున్నాయి.
అవిశ్వాసంపై మాట్లాడి.....
తొలుత వైసీపీ అధినేత జగన్ ను అవిశ్వాసం పెట్టాలని సవాల్ విసిరింది పవన్ కల్యాణ్. దమ్ముంటే అవిశ్వాసం వైసీపీయే పెట్టాలని, వైసీపీ అవిశ్వాసం పెడితే తాను ఢిల్లీకి వచ్చి మద్దతు సమీకరిస్తానని పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పారు. అయితే అవిశ్వాసం పెట్టి పది రోజులవుతున్నప్పటికీ పవన్ ఆ విషయంలో పెదవి విప్పడం లేదు. కనీసం ఢిల్లీకి పోయి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయలేదు. అవిశ్వాసం చర్చకు రాకుండా ఆందోళనకు దిగింది తమిళనాడు, తెలంగాణకు చెందిన అధికార పార్టీ సభ్యులేనన్నది పవన్ కు తెలుసు.
అందరి మద్దతు కూడగడతానని....
తాను అవసరమైతే తమిళనాడుకు వెళ్లి మద్దతు కూడగడతానని పవన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అన్ని విషయాల్లో వెనకేసుకొచ్చే పవన్ కల్యాణ్ ఆయన వద్దకు వెళ్లి కూడా పార్లమెంటు లో జరగుతున్న పరిణామాలపై చర్చించలేదు. పవన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే కేసీఆర్ ను కలిసి పార్లమెంటులో ఆందోళనలు విరమించుకోవాలని కోరేవారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇన్ని రోజుల నుంచి పార్లమెంటులో ఆందోళనలు జరుగుతున్నా పవన్ దాని ప్రస్తావనే తేవడంలేదు. మీడియాకు ఇంటర్వ్యూలు తప్ప గోదాలోకి దిగకపోవడం పట్ల ఆ పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మళ్లీ కన్పించకుండా....
ఇక ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని పవన్ కల్యాణ్ ప్లీనరీలో ప్రకటించారు. అయితే ఆమరణ దీక్ష సంగతి దేవుడెరుగు... ప్రత్యేక హోదా కోసం జరగుతున్న ఉద్యమంలో ఆయన పాత్ర ఎంత అంటే ఏమీ లేదనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ బీజేపీకి అనుకూలంగా మారారని విమర్శిస్తున్నప్పటికీ పవన్ కల్యాణ్ మాత్రం కేంద్రాన్ని నిలదీసేందుకు క్షేత్రస్థాయిలోకి రాకపోవడంపై అనుమానాలు నిజమవుతున్నాయంటున్నారు. ఏపీలో ఇంత జరుగుతున్నా పవన్ పట్టనట్లు వ్యవహరించడంపై ఆ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తుండటం విశేషం.