పవన్ ఇంతకూ ఏం సాధించినట్లు...?

Update: 2018-01-30 07:30 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ మూడు రోజుల అనంతపురం జిల్లా పర్యటన ముగిసింది. అయితే ఒక విషయంలో జనసేనాని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్నికల బరిలో నిలుస్తుందని తెలిపారు. అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన హడావిడిగా సాగింది. కరవు యాత్ర పేరిట పవన్ చలోరే చల్ పేరిట హల్ చల్ చేశారు. అయితే తొలిరోజులు రైతులు, నీటిపారుదల నిపుణులతో సమావేశమైన పవన్ అనంతలో సాగు పరిస్థితిపై చర్చించారు. ముందు తాను అధ్యయనం చేసి తర్వాత సమస్యపై స్పందిస్తానని పవన్ చెప్పారు.

వివాదాస్పదంగా మారిన....

అయితే పవన్ పర్యటన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, మంత్రులను కలవడం కొంత వివాదాస్పదంగా మారింది. మంత్రి పరిటాల సునీత ఇంట్లో అల్పాహారం తీసుకున్న పవన్ ఆమెతో అనంత సమస్యలపై చర్చిందుకే వచ్చానన్నారు. అలాగే వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి జంప్ చేసిన కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ పాషాను కూడా కలవడం కొంత చర్చకు దారితీసింది. రాజ్యాంగ విలువలను కాలరాసి... రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను కలవడంపై కొందరు మేధావులు సయితం పెదవి విరుస్తున్నారు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ప్రశంసించేందుకే వచ్చారన్నది అనంతపర్యటనతో తేలిపోయిందని విపక్షాలు అప్పుడే విమర్శలు ప్రారంభించాయి.

ప్రత్యేక హోదాపై....

ఇకగతంలో ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీపై తీవ్రంగా గళమెత్తిన పవన్ ఈసారి పర్యటనలో ఆ ప్రస్తావన పెద్దగా తేకపోవడం గమనార్హం. అయతే ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ, వైసీపీ వైఖరేమిటో చెప్పాలని పవన్ డిమాండ్ చేయడం విచిత్రంగా కన్పిస్తోంది. బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వమని ఎప్పుడో తేల్చి చెప్పింది. టీడీపీ ప్రత్యేక ప్యాకేజీ చాలని సరిపెట్టుకుంది. వైసీపీ ప్రత్యేక హోదాకావాలంటూ డిమాండ్ చేస్తుంది. ప్రత్యేక హోదాపై పార్టీల వైఖరుల్లో స్పష్టత ఉన్నప్పటికీ వైఖరిని ప్రదర్శించాలని మరోసారి కోరడం ఆయక అవగాహన లేమికి నిదర్శనంగా చెప్పొచ్చు.

విమర్శలు చేసే ప్రయత్నం....

ఇక అమరావతికే అంతా అభివృద్ధిని పరిమితం చేశారని పవన్ వ్యాఖ్యనించడం ఈ పర్యటనలో విశేషం. రాజధాని విషయంలో రాయలసీమకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదని ఆయన ప్రభుత్వంపై కొంత విమర్శను చేసే ప్రయత్నం చేశారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత కొంతకాలంగా అక్కడ న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికీ తీసుకెళ్లారు. అయితే దీనిపై తాను పెద్దలతో మాట్లాడతానని పవన్ చెప్పడం విశేషం. మొత్తం మీద పవన్ పర్యటన సమస్యలపై అవగాహన పెంపొందించుకునేందుకని ఆయన చెప్పినప్పటికీ అంతటా ఆయన అభిమానుల రగడే కన్పించింది.

Similar News