పల్లె వాసనలను పట్టే పనిలో జగన్...!

Update: 2018-01-30 08:30 GMT

పాదయాత్ర ద్వారా జగన్ ఎంతో నేర్చుకున్నారు. మట్టిరోడ్లు, మసకబారిన బతుకులను ఆయన దగ్గరుండి చూస్తున్నారు. మారుమూల పల్లెల నుంచి సాగుతున్న యాత్రకు పెద్దయెత్తున జనం పోటెత్తుతున్నారు. తమ కుటుంబంలోని వ్యక్తి వచ్చాడంటూ జగన్ ను చూసేందుకు తరలి వస్తున్నారు. జగన్ యాత్ర ఇప్పటికే వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కాళ్లనొప్పులు, అరికాళ్లపై బొబ్బలు వచ్చినా జగన్ వెనకడుగు వేయలేదు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా తిరస్కరించారు. మొక్కవోని దీక్షతో ఆయన ప్రతి అడుగూ ముందుకు వేస్తున్నారు. జగన్ పాదయాత్ర చేపట్టి ఇప్పటికి రెండున్నర మాసాలు కావస్తోంది. ఈ రెండున్నర నెలల్లో నాలుగు జిల్లాలు పూర్తి చేసుకుని ఐదో జిల్లా అయిన నెల్లూరులోకి ప్రవేశించారు. జగన్ యాత్ర అగ్రభాగం పల్లెల నుంచే సాగుతోంది.

వినతులను ...వివిధ విభాగాలకు...

అయితే జగన్ పాదయాత్రకు విశేష స్పందనతో పాటు వినతులు కూడా లభిస్తున్నాయి. ఇప్పటికే వినతులు లక్షకు చేరినట్లు అంచనా. వీటిని వ్యక్తిగత సమస్యలు, సామూహిక సమస్యలుగా వైసీపీ కార్యాలయ సిబ్బంది క్రోడీకరిస్తున్నారు. వీటన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో కూడా వైసీపీ ఉందని తెలుస్తోంది. తన పాదయాత్రలో వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదని తెలిసినా... ఒక్క సమస్య పరిష్కారమైనా అది వారికి ఉపయోగపడుతుందన్నది వైసీపీ నేతల భావన. ఇందుకోసమే జగన్ పాదయాత్రలో వచ్చిన వినతులను ఆ యా ప్రభుత్వ విభాగాలకు పంపే యోచనలో ఉన్నారు. పట్టణాల్లో కూడా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.

వెయ్యి గ్రామాల్లో పర్యటించిన....

రాయలసీమలో వినతులు ఎక్కువగా వచ్చాయి. రాయలసీమలో మొత్తం వెయ్యి గ్రామాల్లో పర్యటించారు. ఈ వెయ్యి గ్రామాల్లో ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, మహిళలు, దివ్యాంగులు, ప్రయివేటు కర్మాగారాల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా జగన్ కు వినతులు అందించారు. ప్రజా సంకల్ప యాత్ర ఎక్కువగా పల్లెల్లోనే సాగుతుంది. పల్లెల్లో పట్టు సంపాదించడానికి జగన్ యాత్ర బాగా ఉపయోగపడుతుందన్నది వైసీపీ నేతల భావన. ముఖ్యంగా పల్లెల్లో అనేక సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయని, 1100 నెంబర్ ద్వారా చిటికెలో సమస్యను పరిష్కరిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం లేదని ఈ యాత్ర ద్వారా తేటతెల్లమయిందంటున్నారు వైసీపీ లీడర్లు. ప్రజాసంకల్ప యాత్ర పల్లెల నుంచి సాగుతుందడటంతో పల్లె వాసనలు, అక్కడి ఆప్యాయతలను జగన్ స్వీకరిస్తున్నారు. అవి జగన్ ను కట్టిపడేస్తున్నాయి. అందుకే జగన్ ఒక్కడే సమస్యను పరిష్కరించలేరని, మీరంతా తనకు అండగా ఉండాలంటున్నారు జగన్.

Similar News