పరిటాలకు పట్టున్న చోట జగన్....?

Update: 2017-12-11 08:30 GMT

వైసీపీ అధినేత జగన్ పరిటాల ఇలాకాలోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో ఇప్పటివరకూ శింగనమల, ఉరవకొండ, తాడిపత్రిలోని కొన్ని గ్రామాల్లో జగన్ పర్యటించారు. అయతే ఈరోజు మంత్రి పరిటాల సునీతమ్మ నియోజకవర్గంలో కాలుమోపారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా పరిటాల సునీత ఈనియోజకవర్గం నుంచి విజయం సాధించారు. పరిటాల సునీత మీద 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థిగా టి. ప్రకాశ్ రెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2009 ఎన్నికల్లో సునీతకు 64,559 ఓట్లు రాగా, ప్రకాశ్ రెడ్డికి 62,852 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య కేవలం 1,707 ఓట్లు మాత్రమే తేడా. 2014 ఎన్నికల్లో సునీతపై పోటీ చేసిన ప్రకాశ్ రెడ్డి మాత్రం 7,774 ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం విశేషం. పరిటాల కుటుంబానికి మంచి పట్టున్న ఈ నియోజకవర్గంలో జగన్ పర్యటన రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.

రాప్తాడులో పాదయాత్ర.....

రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం తలుపూరుకు జగన్చేరుకున్నారు. మధ్యాహ్నం ఇక్కడ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం రాప్తాడునియోజకవర్గంలోని వడ్డుపల్లి, మదిగూడ గ్రామానికి చేరుకుంటారు. దీంతో జగన్ పాదయాత్ర రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇప్పటివరకూ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా వ్యక్తిగతంగా ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కాని, ముఖ్యమైన పదవుల్లో ఉన్న టీడీపీ నేతలను జగన్ విమర్శించలేదు. కేవలం చంద్రబాబు పరిపాలనపైనే జగన్ విరుచుకుపడుతుండటం గమనార్హం. జగన్ వెంట వందలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు నడుస్తున్నారు. మొత్తం మీద పరిటాల సొంత నియోజకవర్గమైన రాప్తాడు నియోజకవర్గంలో జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది.

Similar News