అనంతపురం జిల్లా ఉరవకుండ నియోజకవర్గంలోకి జగన్ ప్రవేశించారు. ఉరవకొండ నియోజకవర్గం అంటే పయ్యావుల కేశవ్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. పయ్యావుల కేశవ్ ను ఓడించింది. ఉరవకొండ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వేశ్వర్ రెడ్డి టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్ ను ఓడించారు. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచిన పయ్యావుల కేశవ్ కు వైసీపీ గత ఎన్నికల్లో చెక్ పెట్టగలిగింది. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే పయ్యావుల కేశవ్ కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇటీవల కేబినెట్ హోదా కలిగిన మండలిలో చీఫ్ విప్ పదవి కూడా దక్కింది. వచ్చే ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీని గెలిపించుకునేందుకు జగన్ ఈనియోజకవర్గంలో కాలుమోపారు. పయ్యావుల కేశవ్ జగన్ పై తరచూ నిప్పులు చెరుగుతూ ఉంటారు. వైఎస్ హయాం నుంచే పయ్యావుల టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. దీంతో పయ్యావుల నియోజకవర్గంలో జగన్ పాదయాత్రపై టీడీపీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నేడు పార్లమెంటరీ పార్టీ సమావేశం....
అయితే వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రలో ఉన్నా పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు విశాఖలో వైసీపీ కార్యకర్తల శిక్షణ శిబిరం ఎలా జరుగుతుందో ఆరా తీశారు. అంతేకాదు ఈరోజు వైసీపీ పార్లమెంటు సభ్యులతో జగన్ భేటీ అవుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు గ్రామంలో పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వైసీపీ పార్లమెంటు సభ్యులతో పాటు సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు. రానున్న పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై పార్లమెంటులో నిలదీయాలని వైసీపీ ఎంపీలకు జగన్ సూచించే అవకాశాలున్నాయి. దీంతో పాటు నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్న తీరును కూడా జగన్ సమీక్షించనున్నట్లు తెలిసింది.