ధర్మశాల లో జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ లో అండర్ ఎస్టిమేట్ చేసిన శ్రీలంక భారత్ పై గెలిచింది. ఈ విజయం నిరాశతో వున్న శ్రీలంక క్రికెట్ టీం కి కొత్త ఉత్సహాన్ని ఇచ్చేదే. ఎందుకంటె వరుసగా 12 మ్యాచుల్లో పరాజయం పాలై స్వదేశంలో తమ క్రికెట్ ఫ్యాన్స్ ముందు తలెత్తుకోలేక పోతుంది శ్రీలంక. తాజాగా మొదలైన వన్డే సిరీస్ తొలి మ్యాచ్ లోనే భారత్ పై తిరుగులేని విధంగా ఏడువికెట్ల తేడాతో శ్రీలంక సాధించిన విజయం ఆ టీం కి స్ఫూర్తి గానే నిలుస్తుంది.
విజృంభించిన లంక బౌలర్లు....
ధర్మశాల లోని బౌన్సీ పిచ్ పై చెలరేగిపోయారు లంక బౌలర్లు. దాంతో భారత్ ఖాతా కూడా తెరవకుండా తొలి వికెట్ కోల్పోయింది. రెండు రన్స్ చేసి రెండు వికెట్లు, 8 రన్స్ కి మూడు వికెట్లు 29 రన్స్ చేసేటప్పటికీ ఏడు వికెట్లు కోల్పోయి 50 రన్స్ చేస్తే గొప్పే అనే పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో మాజీ సారధి ధోని జట్టును 100 పరుగుల మైలు రాయి దాటేలా పది ఫోర్ లు రెండు సిక్స్ లతో 65 పరుగులు చేసి మరింత ధాటిగా ఆడే క్రమం లో చివరి వికెట్ గా వెనుతిరిగాడు. ఓపెనర్లు ధావన్, దినేష్ కార్తీక్ డకౌట్స్ గా, రోహిత్ శ్రేయన్ అయ్యర్, మణిశర్మ సింగిల్ డిజిట్ తో అవుట్ అయినా టెయిలెండర్స్ సాయంతో ధోని ఎక్కువగా స్ట్రయిక్ తానే తీసుకుని కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. మొత్తం 38 ఓవర్లలో 112 పరుగులకు టీం ఇండియా చాప చుట్టేసింది.
20 ఓవర్లలోనే విజయతీరాలకు లంక ...
తమ బౌలర్లు ఇచ్చిన అద్భుత అవకాశాన్ని లంక బ్యాట్స్ మెన్ ఏ మాత్రం వృధా కానీయలేదు. ఆరంభంనుంచి ఆచి తూచి ఆడి 20 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మ్యాచ్ ను ఫినిష్ చేసి తమ టీం ను తేలిగ్గా తీసుకుంటే ఇలాగే ఉంటుందని మిగిలిన మ్యాచ్ లకు సంకేతాలు పంపారు. బ్యాటింగ్ లో తేలిపోయిన టీం ఇండియా బౌలింగ్ లోను ప్రత్యర్దులముందు పూర్తిగా చేతులు ఎత్తేసింది. శ్రీలంక బ్యాట్స్ మెన్ లో తరంగ 47 రన్స్ చేయగా మాధ్యుస్ టీం ను విజయ తీరాలకు చేర్చాడు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి లో వున్న నేపథ్యంలో వైస్ కెప్టెన్ రోహిత్ సారధ్యం వహించి తొలిమ్యాచ్ లోనే పరాజయం మూటగట్టాడు. రాబోయే దక్షిణాఫ్రికా టూర్ కి సన్నద్ధం అవుతున్న టీం బౌన్సీ పిచ్ లపై ఈవిధమైన చెత్త ఆటతో అభిమానుల్లో ఆందోళన ఇప్పటినుంచే మొదలైంది.