దేశవ్యాప్తంగా పద్మావతి చిత్రం విడుదలకు ముందే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాలిసివున్నా రోజుకో కొత్త వివాదం పాత సమస్యలకు జోడు అవుతున్నాయి. తాజాగా పద్మావతి చిత్రం ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానీయమని కొన్ని ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇప్పటికే కర్ణీ సేన, బిజెపి, రాజ్ పుత్ లు సినిమాను అడ్డుకోవడానికి చేయని వీధిపోరాటాలు లేవు. న్యాయపరమైన పోరాటాలు చేస్తూనే వున్నారు. వీరికి ముస్లిం సంఘాలు తోడు కావడం తో ఈ చిత్రం విడుదలకు నోచుకుంటుందా లేదా అన్న సందేహాలు మిన్నంటుతున్నాయి. సినిమాలో ఖిల్జీ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీశారని కొన్ని ముస్లిం సంఘాలు ఆరోపిస్తున్నాయి.
పార్లమెంట్ ప్యానెల్ ముందు...
ఇదిలా ఉండగా చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి పార్లమెంట్ ప్యానెల్ ముందు హాజరయ్యారు. ప్యానెల్ వ్యక్తం చేసిన అనుమానాలను ఆయన నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. జర్నలిస్ట్ లకు చిత్రాన్ని సెన్సార్ పూర్తి కాకుండా ఎందుకు చూపించారని పార్లమెంట్ ప్యానెల్ ప్రశ్నలు వేసింది. సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కర్ణీ సేనకు చిత్రం చూపిస్తారా అని అడిగింది. తనకు సినిమా విడుదల కావడమే ముఖ్యమని పార్లమెంట్ కమిటీ కి దర్శకుడు సంజయ్ వివరణ ఇచ్చారు. తమతో చెప్పిన అంశాలపై రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని ప్యానెల్ కోరింది. ఇన్ని వివాదాల నడుమ ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతుంది.