పత్తి విత్తనాలే కాదు.. ప్రతిదాన్నీ ధ్రువీకరించాల్సిందే

Update: 2016-12-01 08:10 GMT

ఆరుగాలం పడిన కష్టం ఒక్కసారిగా కుప్పకూలిపోతే.. అన్నదాత పరిస్థితి జీవితం మొత్తాన్నీ కోల్పోయినట్లు ఉంటుంది. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ గత ఏడాది కాలంలో నకిలీ విత్తనాల బెడదకు రైతాంగం కుప్పకూలిపోయిన సందర్భాలు అనేకం చోటు చేసుకున్నాయి. నకిలీ విత్తనాల తయారీదార్లకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ అయిపోయింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఆశీస్సులతోనే వీరు చెలరేగుతున్నారంటూ ప్రభుత్వాల మీద ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.

అలాంటి నేపథ్యంలో తాజాగా పత్తి విత్తనాలకు ప్రభుత్వం విత్తన ధ్రువీకరణ విధిగా ఉండేలాగా చట్టాన్ని సవరించాలంటూ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అంటున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్వయానా రైతు. అన్నదాతల కష్టసుఖాలు స్వయానా తెలిసిన వ్యక్తి. అలాంటి ఆయన మరో సంగతిని కూడా గుర్తించాల్సి ఉంది. నిజానికి నకిలీవిత్తనాల బెడద వలన ఉండే నష్టం పత్తిలో కాస్త ఎక్కువ కావచ్చు గానీ.. తతిమ్మా అన్ని రకాల విత్తనాల్లోనూ నకిలీలంటూ వస్తే అన్నదాత దారుణంగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే వ్యాపార పంటలు ఏవైనా సరే.. విత్తనాలు విక్రయించే ఏ సంస్థ అయినా సరే.. ప్రభుత్వ ధ్రువీకరణ ఉన్న తరువాతే.. వాటిని మార్కెట్లోకి తెచ్చేలా.. ధ్రువీకరణ లేని విత్తనాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణకు డిమాండ్ చేయాలి.

విత్తన ధ్రువీకరణ కు సంబంధించి చట్టంలో సవరణ జరిగేలా కేంద్రానికి తమ ప్రభుత్వం సిఫారసు చేస్తుందని ఆయన అంటున్నారు. అన్నదాతలకు సంబంధించి... నకిలీలు కాని విత్తనాలు అందుబాటులో ఉంచడం, ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యత తీసుకోవడం, అదే సమయంలో.. పంటబీమా ప్రతిఒక్కరూ చేసేలా జాగ్రత్తలు తీసుకోవడం అనేవి.. ఎలాంటి వైపరీత్యాలు, విధివంచనలు వచ్చినా సరే.. అన్నదాత సాంతం దెబ్బతినకుండా కాపాడుతాయి. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

Similar News