తెలుగుదేశం పాలనపై బీజేపీ ధ్వజమెత్తింది. అంతా అవినీతి మయమయిందంటూ ఆధారాలను బయటపెట్టింది. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్టిసీమలో ఉన్న మెకానిజం ఏంటని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రశ్నించారు. స్పిల్ వే కోసం 1400 కోట్లు ఖర్చు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. పంపుసెట్లకు 341 కోట్లు ఖర్చుచేశారన్నారు. టెండడర్ షెడ్యూల్ లో 30 ఉంటే 24 మాత్రమే పెట్టారన్నారు. ఒక్కొక్క పంపుసెట్ ఖరీదు నాలుగు కోట్లు మాత్రమేనని చెప్పారు. పట్టిసీమ వాస్తవానికి 1129 కోట్లతో పూర్తి కావాల్సి ఉండగా 1667 కోట్లు ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సోము వీర్రాజు నిలదీశారు. మోటారు పంపు సెట్లు 30 వెయ్యాల్సింది 26 పంపుసెట్లు మాత్రమే వేశారన్నారు. డయాఫ్రాం వాల్ కట్టిందానికి టెండర్లు పిలవకుండానే 90 కోట్లు ఇచ్చారు. మట్టి తీయడానికి 67 కోట్లు ఇచ్చారన్నారు.
మట్టి తీయడానికి 67 కోట్లా?
పీఏసీ మీటింగ్ లో ఈ తప్పుడు లెక్కలన్నీ బయట పడ్డాయన్నారు. ఒక లారీ మట్టికి నాలుగు లక్షలు ఎక్కడైనా ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మట్టి తవ్వడానికి 67 కోట్లు ఖర్చు చేయడంపై సోము మండిపడ్డారు. తాము ఇన్ని రోజులూ బయటపెట్టలేదని అనడం అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రి జపాన్ తరహా ఉద్యమం చేస్తామంటున్నారని, పింఛను ఇస్తే మూడు వేలు, లోన్లు మంజూరు చేస్తే ఇరవై వేలు జన్మభూమి కమిటీలు తీసుకుంటున్నారని, ఇదా జన్మభూమి తరహా ఉద్యమమంటే అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీగా ఆయన అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం కింద 27 వేల కోట్లు ఇస్తే... మరుగుదొడ్లు నిర్మాణం చేయకుండానే బిల్లులు కోట్ల రూపాయలు జన్మభూమి కమిటీలు దోచుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అవినీతి విలయ తాండవం చేస్తుందన్నారు.
జన్మభూమి కమిటీల అవినీతి.....
నీరు చెట్టు కింద నాలుగువేల కోట్లు ఖర్చయిందని, మట్టి అమ్మి పదివేల కోట్లు వసూలు చేసుకున్నారన్నారు. తానే కేంద్రప్రభుత్వానికి ఈ విషయంపై ఫిర్యాదు చేశానన్నారు. భూమాతనే అమ్మేసుకుంటున్నారని సోము అన్నారు. నాలుగువేల కోట్లతో పోలవరం స్పిల్ వేను నిర్మించవచ్చన్నారు. అవినీతిని కిందిస్థాయికి తీసుకెళ్లి టీడీపీ దోచుకుంటుందన్నారు. తుని మండలంలో వర్మి కంపోస్ట్ పిట్స్ కట్టామని మూడు కోట్లు స్వాహా చేశారన్నారు. ప్రతి ఎమ్మెల్యే వారి నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో రూలింగ్ జరుగుతుందా? ట్రేడింగ్ జరుగుతుందా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయలేక పోతున్నారన్నారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పుుతుందన్నారు. పాఠశాలలో పేరెంట్స్ కమిటీకి శిక్షణ ఇచ్చేందుకు ఒక ఎంపీ బంధువు కోట్లు దోచేశారన్నారు. ఇందుకు20 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఎవరికి ట్రైనింగ్ ఇచ్చారో చెప్పాలన్నారు.