గుజరాత్ ఎన్నికలు బీజేపీ పెద్దలకు పెద్ద గుణపాఠమే చెప్పాయి. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో పటేళ్లు కమలం పార్టీకి చుక్కలు చూపించారు. ముఖ్యంగా పాటీదార్ ఆందోళన్ సమితి నేత హార్థిక్ పటేల్ కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో బీజేపీ ఒక దశలో కంగారు పడింది. అయితే యువ పాటీదార్లు కాంగ్రెస్ వెంటే నిలిచినా... పటేల్ పెద్దలు మాత్రం కమలదళానికే సై అన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పటేళ్లకు పెద్దపేటే వేశారు. పటేళ్ళను సంతృప్తి పర్చడానికే బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆరుగురికి మంత్రివర్గంలో చోటు...
ఈరోజు రెండోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటుకేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే విజయ్ రూపానీతో పాటు మరో 19 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రిగా మళ్లీ నితిన్ పటేల్ నే ఎంపిక చేశారు. వీరితో పాటు మరో ఐదుగురు పటేల్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యలేకు మంత్రి పదవులు దక్కడం విశేషం. అంటే ప్రస్తుతం ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మంత్రివర్గంలో మొత్తం ఆరుగురు పటేళ్ల సామాజిక వర్గానికి చెందిన వారున్నారన్నమాట.
భవిష్యత్ అవసరాలను ఉంచుకునే...
డిప్యూటీసీఎం నితిన్ పటేల్ తో పాటు కౌశిక్ భాయ్ జమన్ దాస్ పటేల్, సౌరభ్ పటేల్ కు కేబినెట్ పదవులు దక్కాయి. ఈశ్వర్ సింగ్ ఠాకూర్ భాయ్ పటేల్ తో పాటు మరో ఇద్దరికి సహాయ మంత్రులు పదవులు లభించాయి. పటేళ్లను మంచి చేసుకోవడానికే19 మంది లో ఆరుగురికి బీజేపీ నేతలు మంత్రిపదవులు ఇచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. భవిష్యత్తులో పటేళ్ల ఉద్యమం ఊపందుకున్నా ఈ ఆరుగురితోనే దానిని ఎదుర్కొనాలన్న వ్యూహం కూడా ఉందంటున్నారు.