రెండో టి ట్వంటీ మ్యాచ్ లో బౌలింగ్ బ్యాటింగ్ లో రాణించి సిరీస్ ను 1-1 తో సమం చేసింది సఫారీ టీం. టెస్ట్ సిరీస్ తరువాత వన్డే సిరీస్ ఘోరంగా కోల్పోయి వరుస ఓటములతో విమర్శకులనుంచి తీవ్ర వత్తిడి ఎదుర్కొంటున్న సౌత్ ఆఫ్రికా కీలకమైన పోరులో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఓడితే టి ట్వంటీ సిరీస్ ను కోల్పోయే పరిస్థితి లో కెప్టెన్ డుమిని చెలరేగడంతో ఇంకా 8 బంతులు ఉండగానే గెలుపుతీరానికి చేరింది. డుమిని కొట్టిన సిక్సర్ తో విజయం దక్కడంతో సఫారీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ధోని, పాండే ఇన్నింగ్స్......
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి188 పరుగులను చేసింది. భారత్ ఇన్నింగ్స్ లో మనీష్ పాండే 79 పరుగులతో అత్యధిక స్కోరర్ కాగా ధోని 52, రైనా 30, ధావన్ 24 పరుగులతో టీం ఇండియా మంచి స్కోరే ప్రత్యర్థి ముందు ఉంచింది. అయితే ఆరంభం నుంచి దూకుడు మీద వున్న సఫారీలు భారత్ బౌలింగ్ ను చీల్చి చెండాడేశారు. ముఖ్యంగా క్లాసేన్ విధ్వంసకర బ్యాటింగ్ ముందు టీం ఇండియా బౌలింగ్ అస్త్రాలన్నీ తేలిపోయాయి.
క్లాసేన్ దూకూడుకు....
క్లాసేన్ కేవలం 30 బంతుల్లో 69 పరుగులు చేసి పిడుగుల్లాంటి షాట్లతో సిక్సర్లు, ఫోర్లు బాది క్లిష్టమైన విజయాన్ని సులభంగా మార్చేశాడు. క్లాసేన్ వెనుతిరిగినా కెప్టెన్ డుమిని మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో బాధ్యతాయుతంగా ఆడి నాటౌట్ గా నిలిచి సౌత్ ఆఫ్రికాకు మంచి విజయాన్ని అందించాడు. భారత బౌలింగ్ లో చావల్ ఓవర్ కి 16 పరుగులు సమర్పించి అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ కాగా భువనేశ్వర్ ఓవర్ కు సగటున 6.33 పరుగులు మాత్రమే అత్యల్పంగా సమర్పించుకున్నాడు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లో డాలా 2 వికెట్లు, డుమిని ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈనెల 24 న సిరీస్ ను డిసైడ్ చేసే చివరి మ్యాచ్ జరగనుంది.