పొరుగింటి రాజకీయాల్లోకి తెలుగింటి కోడి కయ్యానికి కాలు దువ్వింది. పందెంకోడిగా సుపరిచితుడైన విశాల్ నిన్నమొన్నటి వేళ ఓ సెన్సేషన్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా .. తెలుగింటి కోడి అని ఎందుకు అన్నాం అంటే ఆయన మూలాలు చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి కనుక...వారిది అచ్చ తెలుగు కుటుంబం కనుక.. సో.. ఈ విషయమై సందేహాలు లేవు అనే అనుకుందాం.. ఇక దినకరన్ కి పందెంకోడికి ఏం సంబంధం అన్నది చూద్దాం. ఆ వివరం అవలోకించేముందు లేదా సమీక్షించే ముందు మరికొన్ని వివరాలు తెల్సుకుందాం. లెట్స్ లాగిన్ ..
ఎన్నికలంటే ఇట్టనే ఉండాలి ...
దినకరన్ గెలిచాక ఆర్కే నగరిలో ఈక్వేషన్స్ ఒక్కసారిగా మారిపోయాయి. డీఎంకే డైలమాలో బీజేపీ ఇంకా ఇంకా డిప్రషన్ లో కూరుకుపోయింది. డిపాజిట్లు దక్కని పార్టీగా డీఎంకే, నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పార్టీగా బీజేపీ చరిత్రలో తమ స్థానాన్ని లిఖించుకున్నాయి. బాగుంది ఎన్నికలంటే ఇట్టనే ఉండాలి. మరోలా ఉంటే బాగుండు అని అనుకోరాదు. మొత్తంగా 40వేల ఓట్ల పైచీలుకు గెలుపు సాధించిన దినకరన్ ఇప్పుడిక హీరో.. బాగుంది.. ఇదీ బాగుంది.. ఇక పొలిటికల్ ఈక్వేషన్ ఎలా మారుతుందో చూడాలి.
విశాల్ కేరాఫ్ ఫెయిల్యూర్ స్టోరీ ....
నిన్నటి నడిగర్ ఎన్నికల్లో ఆయనను బదనాం చేయాలని తెగ ప్రయత్నించారు ప్రత్యర్థులు.అయినప్పటికీ రాధికా శరత్ కుమార్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా పోరాడి నిలిచాడు. తన వారిని గెలిపించుకున్నాడు విశాల్. ఈ ఎన్నికల తరువాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నటుల కోసం చేపట్టి వారిని ఆదుకుని మనసున్న మనిషి అనిపించుకున్నాడు. కానీ ఆర్కే నగర్ పోల్ సీన్ లో మాత్రం ఆయన ఓడిపోయాడు. చాలా మంది అనుకున్నట్లే అధికార బలం ముందు ఓడిపోయాడు. నాయకస్వామ్యం ముందు అనూహ్యంగా ఓడిపోయాడు. దీంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. కానీ అతడు పట్టువీడలేదు. ఎన్నికల అధికారులకు ఎంత నచ్చజెప్పాలో ఎన్ని ఆధారాలు తేవాలో తెచ్చి చూపాడు.. కానీ ఆఖరి నిమిషంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్ లో సంతకాలు తమవి కావని అసలు వ్యక్తులే వచ్చి వాంగ్మూలం ఇచ్చేటప్పటికీ ఆయనకు నిరాశే మిగిలింది.అటుపై ఆయన సైలైంట్ అయినప్పటికీ రేపటివేళ ఆయన రాజకీయ అరంగేట్రం షురూ! కానుంది. ఇక దినకరన్ ని ఆయన ఇప్పటికిప్పుడు మద్దతు ఇచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఒక్క విశాల్ నుంచే కాదు ఆర్కేనగరి వాసుల నుంచి కూడా తిరస్కృతి తప్పదు. దినకరన్ అనే ఓ ఫక్తు రాజకీయ వాది దగ్గర విశాల్ నెగ్గుకు రాకపోవచ్చు. కానీ ఆయనను ప్రశ్నించేందుకు విశాల్ కు ఉన్న ఇమేజ్ సరిపోతుంది. ఏదేమైనా శశికళ గ్యాంగ్ ఉచ్చులో విశాల్ పడకుంటేనే మేలు.
మిత్రబేధంతో....
రెండు వర్గాలు కొట్టుకున్నాయి.. ఒకరు లబ్ధి పొందారు అంటే ఏంటి పోరు నష్టం పొందు లాభం అనేగా. పళని పన్నీరు ఈ రెండు వర్గాలూ మిత్ర భేదాన్ని చూపాయి.. మిత్ర లాభాన్ని పొందలేకపోయాయి.ఫలితం అమ్మ అండ్ చిన్నమ్మ ఇద్దరూ ఏక కాలంలో గెలిచారు. సెంటిమెంట్ రాజకీయం వర్థిల్లింది.. కాదు రాజకీయం అనే రాచపుండుపై గిట్టని వారు చల్లిన కారం ఇంకాస్త మండే సరికి దినకరన్ అండ్ కో కి తెలివొచ్చింది.అందుకనో ఎందుకనో అమ్మ వీడియో..పోలింగ్ కు ఓ రోజు ముందు బయటపెట్టి సంచలనం రేపారు. బాగుంది ఇదీ బాగుంది..
ఎమ్మెల్యేలను రప్పించుకునేందుకు...
దినకరన్ (అల్లుడు ) శశికళ (అత్త ) ఆడిన గేమ్ సక్సెస్.. ఇక మూడు నెలల్లో ప్రభుత్వ పతనం ఖాయమని చెబుతున్నాడీయన. అదెలానో ఆయనే కాస్త వివరంగా చెప్పాలి. అన్నాడీఎంకే మనుషులను అదే ఎమ్మెల్యేలను కొనేసత్తా శశికళలో లేదని అనుకోలేం.. కానీ ఐటీ దాడులు పుణ్యమాని అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. రేపటి వేళ పోయెస్ గార్డెన్ లోకి వేద నిలయంలోకి ఆమెని వెళ్లనిస్తే అక్కడ దాచిన నిధుల లెక్కేంటో తేలితే సాధ్యమేమో.. దిస్ ఈజ్ ఆల్సో వెరీ హైపోథిటికల్ ఫార్మెట్.. ఈ దశలో పందెం కోడి అదే విశాల్ ఓ స్టెట్మెంట్ ఇచ్చాడు.. అదేంటో చూద్దాం.
సమస్య పరిష్కారంలో....
ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తానని దినకరన్ కి హామీ ఇచ్చాడు విశాల్.. బాగుంది.. అంతేకాదు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరాడు. ఇది బాగుంది. కుక్కర్ చిహ్నంపై గెలిచిన దినకరన్ ఆ నియోజకవర్గంలోని మహిళలంతా కుక్కర్‌తో హాయిగా వంట చేసుకునే పరిస్థితులు తెప్పించేందుకు పాటుపడాలన్నాడు.. ఇది కూడా రేపటి వేళ అమలుకు నోచుకుంటే ప్రజలంతా హాయిగా ఉండొచ్చు. ఇక రాజకీయ సంక్షోభం అంటారా అది బీజేపీపై ఆధారపడిన విషయం కాదని ఇప్పటికే తేలిపోయింది. తమిళనాట బీజేపీకి, కాంగ్రెస్ కి సంక్షోభాలు సృష్టించే సీన్ లేదు కానీ వస్తే గిస్తే ఆడియన్ గ్యాలరీలో ఉండి చూసి నవ్వుకుంటాయి.. అంతవరకే వాటి స్థాయి..!! దినకరన్ ద హీరో... విశాల్ ద హీరో .. ఇలానే ప్రజలు కూడా హీరోలు అయ్యే రోజు ఏ పోలింగ్ రోజునో కాక అన్ని రోజులూ కావాలని కోరుకుందాం. మిస్టర్ దినకరన్ ఆల్ ద బెస్ట్.