జగన్ పాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు. అరికాళ్లకు బొబ్బలు ఎక్కినా వైద్యుల సాయంతో ఆయన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఉదయం పాదయాత్ర ప్రారంభమయ్యే దానికి ముందు జగన్ కాళ్లకు మసాజ్ చేయిస్తున్నారు. అరికాళ్లు బొబ్బలెక్కకుండా ఆయింట్ మెంట్ పూస్తున్నారు. కాళ్లకు బొబ్బలు, పొక్కులు రావడంతో శుక్రవారం ఉదయం కూడా జగన్ ఇబ్బంది పడ్డారు. వైద్యులు ఈ ఒక్క రోజు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాని జగన్ మాత్రం పాదయాత్రను ఆపేది లేదంటూ బయలుదేరారు. అరికాళ్లకు బొబ్బలు లేవడంతో జగన్ కొంత నెమ్మదిగా నడుస్తున్నారు. రోజుకు 16కిలోమీటర్లు నడిచే జగన్ నిన్నటి నుంచి కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే నడవగలగుతున్నారు. దీనికి తోడు నడుం నొప్పి కూడా బాధిస్తోంది. అయిని పంటి బిగువున జగన్ బాధను భరిస్తూ పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారు.
బొబ్బలు బాధపెడుతున్నా....
ఈరోజు ఎప్పటిలాగానే ఉదయం 8గంటలకు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లేకల్ నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. జూటూర్ లో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. తర్వాత చిన్నహుళ్తిలో జగన్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన పత్తికొండలో భోజన విరామం కోసం ఆగారు. జగన్ పాదయాత్రలో ఇబ్బంది పడుతున్నా ముఖంలో ఏ మాత్రం బాధను కన్పించడం నీయలేదంటున్నారు. నిన్న జగన్ ను చూసేందుకువచ్చిన భారతి కన్నీళ్ల పర్యంతమయ్యారు. జగన్ మరో 2700 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయాల్సి ఉంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పొలాల్లోనే ఏర్పాటు చేసిన టెంట్లలో జగన్ బస చేస్తున్నారు. భోజనాలు కూడా జగన్ వెంట వచ్చే వారందరికీ అందేలా ఒక టీమ్ ప్రత్యేకంగా చూసుకుంటోంది. మొత్తం మీద జగన్ పాదయాత్రకు మాత్రం విశేష స్పందన లభిస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.