నోటు లేక ఆటుపోటు...!

Update: 2018-01-31 18:29 GMT

మళ్ళీ నోట్ల రద్దు నాటి పరిణామాలు కళ్ళముందే ఎదురౌతున్నాయి. నిత్య లావాదేవీలకు సరిపడా బ్యాంక్ లకు రిజర్వ్ బ్యాంక్ పంపిణి చేయకపోవడంతో సామాన్యుడు విల విల లాడుతున్నాడు. చాంతాడంత క్యూలైన్లో ఎటీఎం ల వద్ద... బ్యాంక్ ల్లో నిలబడి తమ డబ్బు తాము తెచ్చుకునేందుకు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం తరువాత రెండో శనివారం ఆ తరువాత ఆదివారం రావడంతో మూడు రోజులపాటు బ్యాంకింగ్ వ్యవస్థ సెలవులో వుంది. ఆరోజునుంచి ఈరోజు వరకు దేశ వ్యాప్తంగా ఎటిఎం కష్టాలను ప్రజలు చవిచూస్తూనే వున్నారు. దాదాపు 40 శాతం నుంచి 60 శాతం వరకు ఎటిఎం లు నాట్ వర్కింగ్ లేదా నో క్యాష్ బోర్డు లతో వెక్కిరిస్తుంటే ఎక్కడ నగదు నిల్వ ఉంటే ఆ ఏటీఎం ల ముందు బారులు తీరి అక్కడ కూడా కొద్ది సమయంలోనే జనం ఖాళీ చేస్తున్నారు.

బ్యాంకింగ్ రంగంపై సన్నగిల్లుతున్న విశ్వసనీయత ...

నగదు రహిత లావాదేవీలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఇంకా అలవాటు పడలేదు. 50 నుంచి 60 శాతం ప్రజలు తమ నిత్యావసరాలను నగదునే వినియోగిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏడాది పాటు దేశంలో సామాన్యులు నానా కష్టాలు పడ్డారు. ఎన్నడు అప్పు చేయని వారు కూడా నోట్ల రద్దు సమయంలో అప్పులకు దిగారు. ఇక వైద్యం, వివాహం, చావు ఇలా భారీ ఖర్చులు చేయాలిసిన వారి కష్టాలు దేవుడికే తెలుసు. ఇంతటి కష్టాలను పంటికింద భరిస్తూ దేశంలో ఏదో మార్పు వస్తుందని సహించారు. ఇంత జరిగినా ప్రయోజనం లేకపోగా నేటికీ కష్టాలు తీరకపోవడం తమ డబ్బు తాము తెచ్చుకునే అవకాశం లేకపోవడం బ్యాంకింగ్ రంగంపై సామాన్యుడికి అసంతృప్తి అసహనం పెరిగేలా చేస్తుంది. ఇది మరింత పెరిగితే బ్యాంకింగ్ రంగం తీవ్ర నష్టాలు కష్టాలను చవిచూసే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ రంగంపై విశ్వసనీయత సన్నగిల్లితే దేశ ఆర్ధిక వ్యవస్థకే చేటు వస్తుందన్న ఆందోళన వినిపిస్తుంది.

ఎందుకీ దుస్థితి ...

నోట్ల రద్దు తరువాత రిజర్వ్ బ్యాంక్ కి జమ అయిన మొత్తంలో ఇంకా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రింట్ చేయలేదని తెలుస్తుంది. ఇప్పటికే 2వేలరూపాయల నోట్ల ప్రింటింగ్ నిలిపివేసి 2 వందలరూపాయల నోట్లను ముద్రిస్తుంది. ఆ నోట్లు ఎటిఎం లలో సాంకేతికతను మార్చకపోవడం వల్ల విరివిగా లభించడం లేదు. బ్యాంక్ లలో మాత్రమే ఇవి విడుదల అవుతున్నాయి. దాంతో నగదు కష్టాలు మరోసారి ముప్పిరిగొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కరెన్సీ కొరత తారా స్థాయికి చేరింది. రిజర్వ్ బ్యాంక్ పంపిణి చేసే సొమ్ముకు ఖాతాదారులకు వున్న డిమాండ్ కు భారీ వ్యత్యాసమే నడుస్తుంది. ఫలితంగా అంతా రోడ్డుపై పడాలిసిన దుస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుని సామాన్యుడి కష్టాలు గట్టెక్కిస్తుందో వేచి చూడాలి.

Similar News