నేను రెడీ....మీరు రెడీనా?

Update: 2018-03-08 03:37 GMT

కేంద్రమంత్రి వర్గం నుంచి టీడీపీ వైదొలగడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ప్రజల ఆకాంక్షలకు చంద్రబాబు తలొగ్గడం శుభపరిణామమేనని, అయితే ఇంకా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. రాజీనామాలు చేయాలనుకున్నప్పుడు ఢిల్లీ పెద్దలకు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. ఏదో జరిగిపోయిందని చంద్రబాబు ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారన్నారు. కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

ఎప్పుడైనా సిద్ధం.....

అవిశ్వాసం ఎప్పుడు పెట్టడానికైనా తాము సిద్ధమన్నారు. మీరు అవిశ్వాసం పెట్టినా సరేనని, తాము మద్దతిస్తామని జగన్ వెల్లడించారు. పార్లమెంటు సమావేశాల చివరి రోజున మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల సెంటిమెంట్ అని, 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదన్నారు. అరుణ్ జైట్లీ ప్రకటన పాతదేనని చెప్పారు. చంద్రబాబు నాయకుడికి రాజకీయ చిత్తశుద్ధి లేదన్నారు.

అప్పుడే ఈ పని చేసి ఉంటే.....

నరంద్రమోడీ ప్రధాని మంత్రిగా అయిన తర్వాత కూడా ప్లానింగ్ కమిషన్ కొన్ని నెలలు ఉంది. అయినా చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పట్టించుకోలేదని జగన్ ప్రశ్నించారు. ప్లానింగ్ కమిషన్ ఏడు నెలలు ఉన్నా నీతి ఆయోగ్ వచ్చేంత వరకూ చంద్రబాబు కాలయాపన చేశారన్నారు. అప్పట్లోనే కేంద్రంపై వత్తిడి తెచ్చి ఉంటే ప్రత్యేక హోదా రాష్ట్రానికి వచ్చి ఉండేదన్నారు. కేంద్రం నుంచి వైదొలగడంలో ఇంత జాప్యం ఎందుకని జగన్ ప్రశ్నించారు. ఎంపీలంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్రంపై వత్తిడి పెరుగుతుందన్నారు.

చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు....

ాధ్యత గలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించలేదని జగన్ అభిప్రాయపడ్డారు. ఇదే పనిని రెండేళ్ల క్రితం చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదన్నారు. ఎన్నికలకు ముందు మంత్రి వర్గం నుంచి వైదొలిగితే ప్రయోజనమేంటని ప్రశ్నించారు. బీజేపీ కూడా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిందన్నారు. ఇతర రాష్ట్రాలను సాకుగా చూపడం కేంద్రానికి సబబు కాదన్నారు. రాష్ట్రాన్ని విభజించే ముందు కర్ణాటక, ఒడిషా, బీహార్ రాష్ట్రాలు కేంద్రానికి గుర్తుకు రాలేదా? అని జగన్ ప్రశ్నించారు. ఆరోజు రాష్ట్రాన్ని విడగొట్టొద్దని గట్టిగా కోరుకున్న పార్టీ వైసీపీయేనని ఆయన అన్నారు. టీడీపీ సమన్యాయమంటూ రాష్ట్ర విభజనకు కారణమైందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చరిత్ర హీనులుగా మిగిలిపోకుండా చిత్తశుద్ధితో న్యాయంగా, ధర్మంగా పోరాటం చేయాలన్నారు. 25 మంది ఎంపీలు ఒక తాటిమీద నిలబడితే కేంద్రం దిగి వస్తుందన్నారు. మార్చి 21వ తేదీ అవిశ్వాసం పెట్టడానికి డెడ్ లైన్ అనేది లేదని, చంద్రబాబు మద్దతిస్తానంటే ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టడానికి రెడీ అని జగన్ చెప్పారు. తాను ఎనిమిది రోజులు గుంటూరులో 8 రోజులు నిరాహారదీక్ష చేస్తుంటే, మోడీ వస్తున్నాడని చెప్పి చంద్రబాబు తనను అరెస్ట్ చేయించారన్నారు. దగ్గరుండి బంద్ లన్నీ చంద్రబాబు నిర్వీర్యం చేశారన్నారు. యువభేరికి వచ్చే విద్యార్థులపై పీడీ యాక్టు పెడతామని చంద్రబాబు బెదిరించారన్నారు. తన స్టాండ్ చాలా పారదర్శకంగా ఉందన్నారు. బీజేపీకి మద్దతిచ్చే పరిస్థితి ఎట్టిపరిస్థితుల్లో రాదన్నారు. ఇక థర్డ్ ఫ‌్రంట్ ఆలోచన మంచిదేనని చెప్పారు. ఎవర్నీ నమ్మకుండా 25 మంది ఎంపీలు కలిసికట్టుగా ఉండాలన్నారు. ప్రత్యేకహోదా ఫైలు పై ఏ పార్టీ సంతకం పెట్టినా వారికి మద్దతిస్తామని చెప్పారు.

Similar News