నేను మగాడిని బుజ్జి ... అంటున్న కేసీఆర్

Update: 2018-03-04 02:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారా ? అవుననే ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. భారత దేశ రాజకీయాలను సమూలంగా మార్చడానికి తెలంగాణ వారి సత్తా ఢిల్లీ వీధుల్లో చాటేందుకు మొత్తానికి కేసీఆర్ కాంగ్రెస్, బిజెపి లకు మూడో ప్రత్యామ్నాయం టిఆర్ ఎస్ అని మనసులో మాట బయటపెట్టేశారు. ఇప్పుడు ఆ దిశగా ఆయన అడుగులు పడనున్నాయి.

ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టేశారు ...

ప్రత్యేక హోదాపై ఏపీలో టిడిపి, బిజెపి లు ప్రజలను వంచిస్తున్నాయని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. ప్రజలకు స్పష్టత ఇవ్వలేని రాజకీయాలతో అంతటా గందరగోళ రాజకీయానికి బిజెపి, టీడీపీ తెరతీశాయని ఇది సరైనది కాదన్నారు ఆయన. ఈ వ్యాఖ్యలతో సీమాంధ్రుల మనసు దోచుకున్నారు ఆయన. అలాగే తెలంగాణలోని రాజధాని ఇతర జిల్లాలో వున్న ఆంధ్రుల ఓటు బ్యాంక్ ఇప్పుడు కేసీఆర్ వైపు వ్యూహాత్మకంగా తిప్పుకున్నారు గులాబీ బాస్. ఇంతకుముందు పార్లమెంట్ లోనే ఆయన కుమార్తె ఎంపీ కవిత ఏపీకి మద్దతుగా నిలిచారు. దీనిని బట్టి సీమాంధ్రుల తెలంగాణ ఓటుబ్యాంక్ పక్కాగా తమ పార్టీ ఖాతాలో టిఆర్ ఎస్ వేసుకున్నట్లే.

బాబును వదల్లేదు ...

కేసీఆర్ ప్రధానంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూనే చంద్రబాబు పాలనలో వైఫల్యం చెందారని ఎత్తి చూపారు. హోదా పై బాబు గందరగోళం చేస్తూ ప్రజలను అయోమయంలో పెట్టారని చెప్పుకొచ్చారు. హోదా నే అంశంలో కేంద్రం ఇవ్వనైనా చెప్పాలి. లేదా ఇస్తా అని పని మొదలు పెట్టాలి. ప్రజలకు ఏమి చేశారన్నది బాధ్యతగా స్పష్టత ఇవ్వడం లేదని ధ్వజమెత్తి చంద్రబాబు వైఫల్యాన్ని ఎండగట్టారు.

కుమార్తె కొడుకు అందిరావడంతో ....

తెలంగాణ రాష్ట్రం కోసం పుష్కర కాలానికి పైగా కొట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ లో చక్రం తానే తిప్పుతానని మోడీ సర్కార్ కి సవాల్ చేశారు. అన్ని పక్షాలతో చర్చించానని , ఇప్పటికే థర్డ్ ఫోర్స్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అది తామే అవుతామని సంకేతాలిచ్చారు. కేసీఆర్ ఈ మాటలు అనడానికి కారణం కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితే అంటున్నారు. 2019 ఎన్నికల తరువాత కేసీఆర్ లెక్కలు వ్యూహాలు మరింత విభిన్నంగా సాగనున్నాయి. ఆయన అడుగులు థర్డ్ ఫ్రంట్ వైపు వేగంగా కదులుతున్నాయి. ఇక జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తన మార్క్ చూపే ప్రయత్నాలకు తెరతీశారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా లేక బిజెపిని దారికి తెచ్చుకోవడానికా? అన్నది రాబోయే రోజుల్లో కాలమే చెప్పనుంది.

Similar News