నేదురుమిల్లి కోటను జగన్ స్వాధీనం చేసుకుంటారా?

Update: 2018-01-30 01:30 GMT

వైఎస్ జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేదురుమిల్లి కుటుంబానికి పట్టున్న నియోజకవర్గమిది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమిల్లి కుటుంబం కొన్ని దశాబ్దాలపాటు ఈ నియోజకవర్గాన్ని శాసించింది. 1989లో నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. తర్వాత 1999, 2004 సంవత్సరాల్లో నేదురుమిల్లి సతీమణి రాజ్యలక్ష్మి ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందారు. మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత నేదురుమిల్లి కుటుంబం ఇక్కడి నుంచి తప్పుకుంది.

గత ఎన్నికల్లో ఓటమి....

తర్వాత 2009, 2014 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ అభ్యర్థిగానిలబడి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2009లో నేదురుమిల్లి రాజ్యలక్ష్మి ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున కొమ్మి లక్ష్మీనాయుడు పోటీ చేశారు. ఆయన టీడీపీ అభ్యర్థి రామకృష్ణ చేతిలో కేవలం ఐదు వేల ఓట్లు తేడాతోనే ఓడిపోయారు. దీంతో జగన్ ఈసారి వెంకటగిరి నియోజకవర్గాన్ని ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఈనియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు చేరుకుంది కూడా ఈ నియోజకవర్గం లోనే కావడం విశేషం.

వెయ్యి కిలోమీటర్లు ఇలా....

వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. జగన్ పాదయాత్ర వద్దకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మరో ఇడుపులపాయలాగా మారింది. జనసంద్రంగా కన్పించింది. గత ఏడాది నవంబరు 6న ఇడుపుల పాయలో ప్రారంభమైన జగన్ యాత్ర కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో వంద కిలోమీటర్లకు, డోన్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్లు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 300 కిలోమీటర్లు, అనంతపురం జిల్లా గుమ్మేపల్లిలో 400 కిలోమీటర్లు, ధర్మవరం మండలంలోని ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్లు, అనంతపురం జిల్లా ఉట్లూరు వద్ద 600 కిలోమీటర్లు, చిత్తూరు జిల్లా జమ్మివారిపల్లె వద్ద 700 కిలోమీటర్లు, అదే జిల్లాలో800 కిలోమీటర్లు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్ల మైలు రాళ్లను దాటారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని సైదాపురం వద్ద వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను జగన్ పూర్తి చేశారు. ప్రతి వంద కిలోమీటర్లకు మెుక్కను నాటిన జగన్, వెయ్యి కిలోమీటర్ల వద్ద మాత్రం పైలాన్ ను ఆవిష్కరించడం విశేషం.

75వ రోజుకు చేరిన యాత్ర.....

వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర 75వ రోజుకు చేరుకుంది. ఆయన ఈరోజు ఉదయం వెంకటగిరినియోజకవర్గం సైదాపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి సిద్ధయ్య కోన, పొక్కనదాల క్రాస్ రోడ్స్, ఊటుకూరు, గిద్దలూరు క్రాస్ రోడ్స్, తురిమెళ్ల, కలిచేడు వరకూ యాత్ర కొనసాగిస్తారు. తురిమెళ్లలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అలాగే కలిచేడులో చేనేత కళాకారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు. జగన్ రాత్రికి కలిచేడులోనే బస చేయనున్నారు.

Similar News