నేతల లీల....టిక్కెట్ల గోల....!

Update: 2018-02-02 20:30 GMT

ఎన్నికల సమయం రాకముందే కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమంటున్నాయి. పీసీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. విమర్శలే కాదు రోడ్డు మీదకు ఎక్కుతున్నాయి. ఎమ్మెల్యే వీరేనంటూ పీసీసీ ప్రకటించడమేంటంటూ ఒక వర్గం ఆందోళనకు దిగింది. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా సీనియర్ నేతలతో భేటీ జరుగుతున్నప్పుడే ఈ ఆందోళన జరగడం విశేషం. ఏకపక్షంగా ఇలా టిక్కెట్లను ప్రకటిస్తే ఊరుకునేది లేదంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలి కాని, తమకు నచ్చినవాళ్ల పేర్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు.

పెద్ద వివాదమే రేపింది.....

కాంగ్రెస్ పార్టీలో ఈ టిక్కెట్ల ప్రకటన రేపిన చిచ్చు ఆరేట్లు లేదు. హైకమాండ్ అనుమతి లేకుండా టిక్కెట్లను ప్రకటించడంపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నియోజకవర్గంలోని మాల్ గ్రామ సర్పంచ్ ఇటీవల టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా పీసీసీ నేతలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ ను గెలిపించాలని పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. గత ఎన్నికల్లోనూ ఇబ్రహీంపట్నం టిక్కెట్ ను క్యామ మల్లేష్ కే దక్కింది. అయితే ఆ ఎన్నికల్లో మల్లేష్ మూడో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఓటమి పాలయిన వ్యక్తికి మళ్లీ టిక్కెట్ ఇస్తామని ఎలా పీసీసీ ప్రకటిస్తుందని కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

బెదిరింపులు...హెచ్చరికలు.....

మల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబానికికాకుండా టిక్కెట్ ఎలా ఇస్తారో చూస్తామని గాంధీభవన్ ఎదుట కొందరు బెదిరింపులకు దిగారు. గతంలో టిక్కెట్ రాకపోయినా రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్ రెడ్డి రాంరెడ్డి ద్వితీయ స్థానంలో ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. దీంతో నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పాల్సి వచ్చింది. మల్లేష్ కు టిక్కెట్ ఇస్తే తాము వ్యతిరేకంగా పనిచేస్తామని ఉత్తమ్ ముందే వారు కుండబద్దలు కొట్టేశారు. గతంలో కూడా పీసీసీ నేతలు ఇలాగే వ్యవహరించారు. అప్పుడు కూడా పెద్ద వివాదమే అయింది. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి సీటు అని పీసీసీ నేతలు ప్రకటించారు. దీంతో అక్కడే టిక్కెట్ ఆశిస్తున్నబొమ్మ వెంకన్న అనుచరులు వీరంగం సృష్టించారు. ఇలా అభ్యర్థులు వీరేనని, వీరికే ఓటేయాలని పలు సందర్భాల్లో పీసీసీ నేతలు చేస్తున్న ప్రసంగాలు పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికైనా అభ్యర్థుల విషయాన్ని పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పలువురు నేతలు కోరుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే... ఎన్నికల వేళ గాంధీ భవన్ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాల్సిందేనన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి.

Similar News