నేడు....హైదరాబాద్ లో హై అలర్ట్...!

Update: 2017-10-27 01:30 GMT

నేటి నుంచి తెలంగాణలో రాజకీయాలు వేడెక్కనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం యాభై రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో నిర్ణయించారు. ప్రజాసమస్యలపై చర్చించడానికి తాము పూర్తిగా సిద్దంగా ఉన్నామని అధికార టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. విపక్షాలు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే రైతు సమస్యలపై చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల వ్యవహరిస్తున్న వివక్షకు నిరసనగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. తెలంగాణలోని 31 జిల్లాల నుంచి రైతులను హైదరాబాద్ కు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఎవరూ గుంపులుగా చేరడానికి వీల్లేదని పోలీసు శాఖ ప్రకటించింది.

ఎక్కడికక్కడ అరెస్ట్ లు.....

మరోవైపు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. నల్లగొండ, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో రాత్రి నుంచే అరెస్ట్ లు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష నేత జానారెడ్డి తీవ్రంగా స్పందించారు. అక్రమ అరెస్ట్ లకు భయపడేది లేదన్నారు. ఉద్యమాన్ని పోలీసులతో అదుపు చేయాలని చూస్తే తాము వేరే మార్గాన్ని చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ చలో అసెంబ్లీ పిలుపుతో హైదరాబాద్ లో హై అలర్ట్ ను ప్రకటించారు. హైదరాబాద్ కు వచ్చే ప్రధాన రహదారుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వచ్చే వాహనాలన్నింటినీ తనిఖీచేసిన తర్వాత నగరంలోకి అనుమతిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తేనే రైతు సమస్యలు తెలుస్తాయన్నారు. చలో అసెంబ్లీ సందర్భంగా ఏం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Similar News