నేడు కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా వైసీపీ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో పెద్దయెత్తున కార్యక్రమాలకు ప్లాన్ చేసింది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా మానవ హారం చేపట్టనుంది. కేంద్రప్రభుత్వంపై సోమవారం మరోసారి వైసీపీ, టీడీపీ అవిశ్వాసం పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
అన్ని నియోజకవర్గాల్లో మానవహారాలు....
ఈ నేపథ్యంలోనే తొలి నుంచి ప్రత్యేక హోదా కావాలంటూ పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. వైసీపీ ఎంపీలకు సంఘీభావంగా క్యాడర్ అంతా మానవహారంలా ఏర్పడి ఐక్యతను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీతో పాటు వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై పెడుతున్న అవిశ్వాసానికి మద్దతుగా నిలవాలని కోరారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్.....
కాగా ఆదివారం ఉగాది సందర్భంగా పాదయాత్రకు విరామమిచ్చిన జగన్ నేడు 115వ రోజు ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రస్తుతం జగన్ గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకుమాను వద్ద బస చేశారు. నేడు కాకుమాను నుంచి తిరిగి పాదయాత్ర ప్రాంరంభం కానుంది. అక్కడి పెద్దివారిపాలెం క్రాస్ మీదుగా కొమ్మూరు వరకూ యాత్ర సాగుతుందని వైసీపీ నేతలు చెప్పారు. కొమ్మూరులో భోజన విరామం అనంతరం నాగులపాడు మీదుగా పెదనందిపాడుకు చేరుకుంటుంది. పెదనందిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. జగన్ ఇప్పటి వరకూ 1528కిలోమీటర్లు పాదయాత్రను పూర్తి చేశారు.