నెహ్రూను కూడా బీజేపీ వదలలేదే?

Update: 2017-11-17 16:30 GMT

గుజరాత్ రాజకీయం నీచంగా మారింది. వ్యక్తులనే టార్గెట్ గా చేసుకుని పాలిటిక్స్ ను ప్లే చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తలపడుతున్నాయి. ఇంతకు ముందు అనుకున్నట్లు గుజరాత్ లో గెలుపు బీజేపీకి అంత నల్లేరు మీద నడకేం కాదని తేలింది. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ బీజేపీకి పట్టు కోల్పోంతుందన్న ఫలితాలు రావడంతో కమలనాధులు అప్రమత్తమయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాధులు వైరి పక్షాన్ని బలహీనపర్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పటేల్ సామాజిక వర్గం తమకు అండగా నిలుస్తుందని బీజేపీ భావించింది. కాని ఆ ఆశలు గల్లంతయ్యాయి. పటేల్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ కాంగ్రెస్ వైపు వెళ్లాడు. బీజేపీపై నిప్పులు చెరుగుతున్నాడు.

వీడియోలు, ఫోటోల కలకలం....

అయితే హార్థిక్ పటేల్ పై బీజేపీ రెండు అశ్లీల వీడియో క్లిప్స్ ను విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఇవి హల్ చల్ చేశాయి. హార్థిక్ పటేల్ యువతులతో ఉన్న సందర్భంగా తీసిన వీడియోను చూపిస్తూ హార్థిక్ స్త్రీలోలుడిగా సంభోదించింది. దీనిపై హార్థిక్ పటేల్ బీజేపీ పై మండిపడ్డారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. అలాగే తాజాగా కాంగ్రెస్ పైన కూడా ఇలాంటి ఫొటోలే సోషల్ మీడియాలో దర్శన మిస్తున్నాయి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కొందరు యువతులతో ఉన్న ఫొటోలను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పెద్దల బండారమిదేనని పోస్టింగ్ లు పెట్టారు. దీంతో కాంగ్రెస్ బీజేపీపై ఫైర్ అయింది. బీజేపీ నీచరాజకీయానికి ప్రజలు బుద్ధి చెబుతారని కాంగ్రెస్ విమర్శించింది. అయితే నెహ్రూతో ఆయన సోదరి విజయలక్ష్మి పండిట్ ఉన్న ఫొటోలను కూడా పెట్టడం వివాదాస్పదంగా మారింది. మొత్తం మీద గుజరాత్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ వీడియో క్లిప్ లు, ఫొటోలు కలకలం రేపుతున్నాయి.

Similar News