నెల్లూరు వైసీపీకి అదుర్స్...!

Update: 2018-02-17 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా ముగిసింది. జగన్ ఊహించిన దానికన్నా విజయవంతం అయిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడే జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదాను ప్రకటించకపోతే ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించింది కూడా నెల్లూరు జిల్లాలోనే కావడం విశేషం. నెల్లూరు జిల్లాలో జగన్ మొత్తం 266.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. దాదాపు 20 రోజుల పాటు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఈ పాదయాత్ర సాగింది.

నెల్లూరులోనే కీలక పరిణామాలు....

అయితే నెల్లూరు జిల్లాలో జగన్ పాదయాత్ర సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. ఇదే జిల్లాలో జగన్ వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని దాటారు. నెల్లూరు జిల్లా సైదాపురం ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్లకు జగన్ పాదయాత్ర చేరుకోవడంతో అక్కడ గుర్తుగా పైలాన్ ను ఏర్పాటు చేశారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లోనూ వైసీపీకి అండగా నిలిచింది. దీంతో ఆయన యాత్ర సక్సెస్ కావడానికి ఇది కూడా ఒక కారణంగాచెప్పుకోవచ్చు. ఇక నెల్లూరు జిల్లాలోనే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేరుకోవడం, అదే జిల్లాలో పార్టీ ఎంపీల రాజీనామాల ప్రకటన చేయడంతో ఈ పాదయాత్రలో నెల్లూరు జిల్లా హైలెట్ గానిలచింది.

1200 కిలోమీటర్లు దాటిన....

ఇక నెల్లూరు జిల్లాలో నేతలు విభేదాలను మరిచి జగన్ వెంట నడవటం విశేషంగా చెప్పుకోవచ్చు. జగన్ పాదయాత్ర నేతల మధ్య ఐక్యతారాగాన్ని పెంచిందంటున్నారు. ఇక జగన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలోని రామకృష్ణాపురం వద్ద జగన్ 1200 మైలురాయిని దాటారు. అక్కడ జగన్ మొక్కను నాటారు. ప్రతి వంద కిలోమీటర్లకు జగన్ మొక్కను నాటుతూ వస్తున్నారు. తర్వాత తిమ్మారెడ్డి పాలెం క్రాస్ రోడ్స్, వెంగళాపురం, అమ్మపాలెం క్రాస్ రోడ్స్, బంగారక్క పాలెం వరకూ యాత్ర సాగించారు. బంగారక్క పాలెంలోనే జగన్ రాత్రి బస చేశారు.

జగన్ 90వ రోజు షెడ్యూల్ ఇదే.....

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 90వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లాలోని బంగారక్క పాలెం నుంచి జగన్ పాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. అక్కడి నుంచి వలేటి వారి పాలెం, గాంధీనగర్, రోళ్లపాడు క్రాస్ రోడ్స్, పోలినేని పాలెం క్రాస్ రోడ్స్, ఉప్పరపాడు క్రాస్ రోడ్స్ వరకూ పాదయాత్ర జరుగుతుంది. అక్కడ జగన్ మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. తిరిగి పాదయాత్ర అక్కడి నుంచి ప్రారంభమై కునిపాలెం క్రాస్ రోడ్స్ కు చేరుకుంటుంది. తర్వాత పోకూరు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు.

 

Similar News