బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తారా? ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిని చూసిన తర్వాత నితీష్ కు తత్వం బోధపడిందా? కమలంతో కరచాలనం అసలుకే ముప్పుతెస్తుందని భావిస్తున్నారా? అంటే అవుననే చెబుతున్నాయి ఢిల్లీ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ తర్వాత ప్యాకేజీగా మార్చి కేంద్రప్రభుత్వం మోసం చేసిందని చెబుతూ ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చింది. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పకపోవడంతోనే టీడీపీ బయటకు వచ్చింది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో మోడీ చరిష్మా తగ్గుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రత్యేక హోదాను అడ్డంపెట్టుకుని బీజేపీకి రాం...రాం చెప్పేశారన్న టాక్ కూడా ఉంది.
ఏపీ సీన్ రిపీట్ అవుతుందా?
అయితే బీహార్ లో కూడా ఏపీ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అరారియా లోక్ సభ స్థానంతో పాటు జహనాబాద్ అసెంబ్లీ స్థానం కూడా రాష్ట్రీయ జనతాదళ్ కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో గెలుచుకుంది. ఈ ఫలితాలే నితీష్ లో మార్పు రావడానికి కారణంగా చెబుతున్నారు. బీహార్ కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మోడీకి కూడా తొలినాళ్లలో సానుకూలంగా స్పందించారు. అయితే ఆర్జేడీని వదిలి బీజేపీతో చేతులు కలిపాక నితీష్ ను కూడా బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదన్నది ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు.
కేంద్రంపై వత్తిడి తేవాలని.....
దీంతో నితీష్ కూడా ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలోనూ ఆర్జేడీ నేతలు ప్రత్యేక హోదా సాధించకుండా నితీష్ కుమార్ బీజేపీ చేతిలో పావుగా మారిపోయారని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతో చేతులు కలిపి హోదా విషయాన్ని నితీష్ మర్చిపోయారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో జేడీయూ నేత త్యాగి పార్లమెంటు ఆవరణలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాపై తాము పోరాటం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్రంపై గట్టిగా వత్తిడి తేవాలని నితీష్ నిర్ణయించారు. నితీష్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. మొత్తం మీద నితీష్ కూడా బీజేపీ అధినాయకత్వం వ్యవహారశైలి పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.