నీళ్లు అడిగినందుకు కూడా హౌస్ అరెస్టులేనా?

Update: 2016-11-19 07:56 GMT

రాష్ట్రంలో అసలు ప్రభుత్వ వ్యతిరేక స్వరం అంటూ వినిపించనే కూడదని చంద్రబాబునాయుడు సర్కారు దృఢంగా అనుకుంటున్నదో ఏమో గానీ.. మొత్తానికి అన్నదాతలకు సాగునీటి కోసం జరిగే ఆందోళనను కూడా ఉక్కుపాదంతో అణిచివేయడానికి జరిగిన ప్రయత్నం విమర్శల పాలవుతోంది. తుంగభద్ర ఆయకట్టు భూములకు తక్షణం నీటిని విడుదల చేయాలనే డిమాండ్ తో అనంతపురంలో ఆందోళన చేయదలచుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ గృహనిర్బంధం చేయడం, ప్రజాందోళనకు తరలివచ్చిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడం, మొత్తానికి అసలు ఆ డిమాండ్ తో ఉద్యమమే జరగకుండా చూడడానికి వందల సంఖ్యలో పోలీసులను మోహరించడం ఇదంతా కూడా అలాంటి అభిప్రాయాన్నే కలిగిస్తున్నాయి.

అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేసే విషయంలో చాలా రోజులుగా డిమాండ్లు, వివాదాలు నడుస్తున్నాయి. అంతిమంగా ఈరోజు ప్రజాందోళన నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు నిర్ణయించాయి. వైకాపా నేతలంతా ఇందుకోసం అనంతపురానికి చేరుకున్నారు. వేల సంఖ్యలో వారి కార్యకర్తలు, రైతులు కూడా వచ్చారు. అయితే ఈ ఆందోళనను అనుమతించేది లేదంటూ.. నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాధ రెడ్డి, పద్మావతి లను గృహ నిర్బంధం చేశారు. వామపక్షనేతల పరిస్థితి కూడా అంతే. పోలీసుల దమననీతిని విమర్శించిన వెంకట్రామిరెడ్డి సాగునీళ్లు అడిగినందుకు ప్రభుత్వం ఇలా అణచివేత చర్యలకు పాల్పడడం సరికాదని విమర్శించారు.

ద్వంద్వనీతి కాదా..

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకవైపు రాయలసీమను రతనాల సీమ చేసేస్తా అని ఆ ప్రాంత రైతులు వచ్చి తనను కలిస్తే చాలా తియ్యటి హామీలు ఇస్తారు. కనీసం అవకాశం ఉన్నప్పుడు తుంగభద్ర ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేయాలంటున్న అన్నదాతల కోరికను కూడా మన్నించకపోవడం ఏమిటో, ఆ ఆందోళనను అణచివేయాలనుకోవడం ఏమిటో అర్థంకాని సంగతి. మొత్తం సీమను సస్యశ్యామలం చేసేస్తా అనే చంద్రబాబు.. ఈ డిమాండ్లను ఎందుకు చెవిన వేసుకోవడం లేదనేది పరిశీలకుల సందేహంగా ఉంది.

అదే సమయంలో.. అన్నదాతల ఆందోళనను కూడా పోలీసులు అడ్డుకుని అణచివేయడం ఎందుకన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంది. ముద్రగడ పాదయాత్రను అనుమతించకుండా అడ్డుకున్నప్పుడు... కులపరమైన ఉద్యమాలు జరుగుతున్న సమయంలో అవి హింసాత్మకంగా మారుతున్న దాఖలాలు చాలా ఉన్నాయని, అందుకే అనుమతి ఇవ్వలేదని ఓ వాదన వినిపించారు. మరి అన్నదాతల డిమాండ్ కు అలాంటి అభ్యంతరం ఎందుకు వచ్చింది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి నిరసన స్వరాన్ని వినిపించకుండా ఎప్పటికీ తొక్కేస్తూనే ఉంటారా? అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Similar News