బ్యాంక్ లను నిండా ముంచిన కేసుల్లో నిందితులంతా విలాసవంతమైన జీవితాలు గడిపిన వారే. విజయ మాల్యా నుంచి నీరవ్ మోడీ వరకు ఇదే తంతు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొంప ముంచిన నీరవ్ మోడీ ఆస్తులను ఎటాచ్ చేసే పనిలో బిజీగా వున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి దిమ్మ తిరిగే వాస్తవాలు కళ్ళముందు దర్శనమిస్తున్నాయి. నీరవ్ విలాసవంత జీవితం వారి ముందు కనపడేసరికి షాక్ కి గురౌతున్నారు అధికారులు. ముంబాయిలోని నీరవ్ ఇల్లు సముద్ర మహల్ తనిఖీలో కళ్ళు చెదిరే విలాసం చూసినవారు ఔరా మోడీ అని ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇంటి నిండా కోట్ల విలువైన వస్తువులే ...
నీరవ్ ఇంటి నిండా కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలు సీజ్ చేసింది ఈడీ. ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పెయింటింగ్ ల విలువ 26 కోట్ల రూపాయల పైమాటే. అలాగే ఆయన ధరించే వాచ్ కోటిన్నర రూపాయలు కాగా, ఉంగరం పదికోట్ల రూపాయాలు దాటే ఉంటుందని తేలింది. అత్యంత విలాసవంతమైన భవనంలో ఎక్కడ ముట్టుకున్నా కోట్ల ధరే పలకడం చూస్తే బ్యాంక్ సొమ్ము తన కాస్ట్లీ లైఫ్ కి వినియోగించిన తీరు కనిపిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను 13 వేల కోట్ల రూపాయలకు ముంచేసిన నీరవ్ మోడీ నుంచి స్థిరచరాస్థుల రూపంలో ఇప్పటివరకు 7 వేల 638 కోట్ల రూపాయలను ఈడీ సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 251 ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు నీరవ్ మింగిన సొమ్మును కక్కించే పనిలో పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాయి.