విరాట్ కోహ్లి... ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కోహ్లి గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు కేరింతలే... కేరింతలు.. ఇక కోహ్లి నిలదొక్కుకున్నాడంటే... శతకమే... అతి చిన్న వయస్సులో మైదానంలో పరుగుల వరదను పారించిన కోహ్లీ భారత్ క్రికెట్ జట్టుకు ఒక వరం అనక తప్పదు. విరాట్ కొహ్లీ రికార్డుల మీద రికార్డులను బద్దలు కొట్టారు. అయినా కోహ్లీ పరుగుల దాహం తీరదు. నిత్యం పరుగు కోసం పరుగు తీస్తూనే ఉంటారు. విరాట్ కోహ్లీ 1988 నవంబర్5వ తేదీన జన్మించాడు. నేటికి 29వ వయస్సులోకి అడుగుపెట్టబోతున్నాడు. 2008 తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కోహ్లీ ఇకపరుగు ఆపలేదు. తనకంటూ ప్లేగ్రౌండ్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
పాక్ లోనూ అభిమానులే....
కోహ్లికీ భారత్ లోనే కాదు ప్రత్యర్థి దేశం పాకిస్థాన్ లోనూ అభిమానులున్నారంటే విడ్డూరం కాదేమో. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క ఆణిముత్యం. కోహ్లి క్రీజులో ఉన్నాడంటే చాలు గెలుపు తమదేనన్న నమ్మకం భారత్ క్రికెట్ అభిమానులది. ఇక క్రికెట్ కామెంటేటర్లు కూడా కోహ్లీ షాట్లను వర్ణించలేనంతగా ఉంటాయంటారు. కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా పదిహేను వేల పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ప్రపంచ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో తిరుగులేని ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. టెస్ట్, వన్ డే, టీ 20లలో వికెట్ల మధ్య పరుగులు తీయడమే కోహ్లికీ తెలిసిన విద్య అంటారు. తాను కెప్టెన్ గా ఉన్న మాజీ కెప్టెన్ ధోని సలహాలను ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఇండియాకు విజయాలను పంచిపెడుతున్నారు. భారత్ కెప్టెన్ గా కోహ్లీ మరిన్నిరికార్డులు సాధించాలని, భారత్ కు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుందాం... హ్యాపీ బర్త్ డే టు కోహ్లీ... ఆల్ ది బెస్ట్.