టెక్నాలజీ విషయంలో దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ముందుకు తీసుకెళ్లిపోతున్నా అని ప్రకటిస్తూ.. తదనుగుణంగా సాంకేతికంగా తాను కూడా ఎప్పుడూ ముందంజలోనే ఉండే ప్రధాని నరేంద్రమోదీ.. అదే టెక్నాలజీ అంటే జడుసుకునే పరిస్థితి ఏర్పడుతున్నట్లుంది. కేవలం మొబైల్ ఫోన్ల కారణంగా.. ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం బయటకు లీక్ అయిపోతోందని మోదీ భావిస్తున్నారట. అందుకే తన సారథ్యంలో జరిగే కేంద్ర కేబినెట్ సమావేశానికి వచ్చే ఎవ్వరూ కూడా.. మొబైల్ ఫోన్లతో రావద్దంటూ నిషేధాజ్ఞలను విధించేశారుట.
సాధారణంగా ఏ ప్రభుత్వానికి అయినా ఉండే ఇబ్బందులే కేంద్రంలో మోదీ సర్కారుకు కూడా ఉన్నాయి. వారేమో చాలా పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య కేబినెట్ సమావేశాలకు కూర్చుంటారు. కానీ.. అక్కడ వారేం మాట్లాడుకుంటున్నారో.. ఏం చర్చించుకుంటున్నారో సమస్తం బయటకు లీక్ అయిపోతూ ఉంటుంది. ఇది ఎక్కడా జరుగుతున్నదే. కాకపోతే మోదీ దీని మీద సీరియస్ అవుతున్నారు. ఇందుకు మంత్రుల మొబైల్ ఫోన్లే కారణం అని భావిస్తున్న మోదీ.. కేబినెట్ భేటీలకు ఎవ్వరూ మొబైల్స్ తేరాదని ఆదేశించారుట. ఈ మేరకు అన్ని మంత్రిత్వ శాఖలకు కూడా సమాచారం పంపడం కూడా జరిగింది.
అయినా.. కేబినెట్ లో జరిగే చర్చలు గోప్యమైనవి అనే భావన మంత్రి వర్గ సహచరులకు ఉండాలి. మొబైల్ ఫోన్లను నిషేధించడం వల్ల మహా అయితే... మీడియాకు లేదా బయటి వారికి లీక్ కావడానికి కొన్ని గంటలు ఆలస్యం జరుగుతుందే తప్ప.. దాన్ని ఆపడం మోదీ వల్ల కాదు కదా..! లీక్ చేసే బుద్ధులు ఉన్న వాళ్లు తాము సమావేశం నుంచి బయటకు వెళ్లగానే లీక్ చేసేస్తారు. కాబట్టి మంత్రులే తమ భేటీ వివరాలను వెల్లడించే విషయంలో స్వతంత్రంగా వ్యవహరించకుండా.. అధికారికంగా వెల్లడించే ఒక్కరికి మాత్రమే ఆ పనిని అప్పగించి మిగిలిన వారు అసలు ఆఫ్ ది రికార్డ్ గా కూడా మాట్లాడకుండా ఉండేలా.. జాగ్రత్తలు తీసుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు.