నిర్ణయం వాయిదా వేసుకోండి : జగన్ డిమాండ్

Update: 2016-11-23 04:50 GMT

ఏపీలో విపక్షనేత , వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఎట్టకేలకు నోట్ల రద్దు వ్యవహారం, ప్రజల కష్టాల గురించి స్పందించారు. అనాలోచిత చర్యల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న కేంద్రం తక్షణాన్ని ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని జగన్ కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాదులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ... ఈ విషయంలో తన స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు. నోట్ల రద్దు వెనుక కేంద్రం ఉద్దేశం మంచిదే అయినా.. అమలు చేస్తున్న తీరు మాత్రం సరిగా లేదని, దేశవ్యాప్తంగా ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆయన చెప్పారు. ఎలాంటి ముందు జాగ్రతత్త చర్యలు, ఎలాంటి ఇబ్బుందులు రాగలవో వాటిని ఊహించి, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోకుండా.. హడావుడిగా చేయడం విజ్ఞతగల నిర్ణయం కాదని జగన్ విమర్శించారు.

నోట్ల రద్దు గురించి ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ముందే తెలుసునని జగన్ విమర్శించారు. అందుకే ఆయన తన నల్లధనాన్ని మొత్తం ముందే సర్దుకున్నారంటూ ఆరోపణలు చేశారు. అక్టోబరు 12న చంద్రబాబునాయుడు నోట్ల రద్దు గురించి కేంద్రానికి లేఖ రాస్తే.. నవంబరు 8న నిర్ణయం వచ్చిందని ఈలోగా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నల్లదనం మార్చేసుకున్నారని జగన్ పేర్కొన్నారు.

నల్లధనం కట్టడి చేయాలనే నిర్ణయానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని జగన్ చెప్పారు. ప్రాథమికంగా ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఏ నాయకుడు అయినా సరే.. మంచి నిర్ణయం అనే అంటారని, కాకపోతే.. అందుకు అనుసరిస్తున్న విధానమే బాగాలేదని జగన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు తొలుత తాను లేఖ రాయడం వల్లనే ఇదంతా జరిగిపోయిందని చెప్పుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నదని తెలియగానే.. కేంద్రం మీద తనకు అసహనం పెరుగుతున్నట్లుగా ప్రచారం చేయించుకుంటున్నారు అంటూ దెప్పి పొడిచారు. అంతా ఆన్‌లైన్ లావాదేవీలు జరగాలని, క్రెడిట్ కార్డులు, ప్లాస్టిక్ మనీ లావాదేవీలు జరగాలని చంద్రబాబునాయుడు క్షేత్రస్థాయిలో ఉండే ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచించకుండానే మాట్లాడుతున్నారంటూ జగన్ విమర్శించారు. మనదేశంలో 90 శాతం క్యాష్ ఎకానమీ నడుస్తోందని, అలాంటప్పుడు ఒక్కసారిగా మొత్తం వ్యవస్థను ప్లాస్టిక్ ఎకానమీలోకి మార్చేయడం సాధ్యమేనా? దీని వల్ల జనానికి , సామాన్యులకు ఎన్ని రకాల కష్టాలు వస్తాయో తెలుసునా? అంటూ జగన్ ప్రశ్నించారు.

ప్రతి నిర్ణయాన్ని, పార్టీ విధానాలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ.. ప్రతిరోజూ అధ్యక్షుడే వచ్చి మీడియా ముందు చెప్పాల్సిన అవసరం లేదని, తమ పార్టీ తరఫున కూడా నిర్ణయాన్ని సమర్థిస్తూ, ప్రజల కష్టాలను తీర్చాలని తొలిరోజునే స్పందన తెలియజేశామని.. తమ పార్టీ స్పందించలేదని అనడం కరెక్టు కాదని జగన్ వ్యాఖ్యానించారు. పూర్తి అవగాహన తెచ్చుకున్నాక మాట్లాడడం కోసం తన వ్యక్తిగత స్పందన ఆలస్యం అయిందని జగన్ చెప్పారు.

Similar News