ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపికబురు అందించనుంది. వారం పది రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అనుమతిచ్చింది. 31 జిల్లాల ప్రకారం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు కూడా విడుదలయ్యాయి. డిగ్రీలో యాభై శాతం మార్కులొచ్చిన విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. అయితే ఎస్సీ, ఎస్టీలకు ఇది 45 శాతం మార్కులకే అర్హులుగా మార్గదర్శక సూత్రాల్లో పేర్కొంది. అయితే తొలుత పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు తొలుత భావించారు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అంగీకరించలేదు. జిల్లాలు ఏర్పడి సంవత్సన్నరం గడుస్తుంటే ఇంకా పాత జిల్లాల ప్రస్తావన ఎందుకని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు న్యాయనిపుణులు సంప్రదించారు.
31 జిల్లాల మేరకు నోటిఫికేషన్........
జోనల్ వ్యవస్థ కొనసాగుతున్నందున పాత జిల్లాల మేరకు వేయాలన్నది కొందరి అధికారుల వాదన. దీనిపై తర్జన భర్జన పడ్డారు. న్యాయనిపుణుల సలహా మేరకు కొత్త జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుల చేయాలని అధికారులు నిర్ణయించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు. ఉపాధ్యాయపోస్టులు జిల్లా క్యాడర్ పోస్టులు కావడంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తవనిన్యాయ నిపుణులు చెప్పడంతో 31 జిల్లాల మేరకు నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక టీపీఎస్సీ ఇక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. టీపీఎస్సీ 80 శాతం మార్కులకే రాత పరీక్ష నిర్వహిస్తుంది. మిగిలిన 20 శాతం టెట్ వెయిటేజీతో అర్హులను నిర్ణయిస్తారు. 31 జిల్లాలకు నోటిఫికేషన్ విడుదలయినందున అన్ని జిల్లాల్లో నిరుద్యోగులు లబ్దిపొందుతారని భావిస్తున్నారు.