దేశంలో రాజకీయ పరిణామలు వేగంగా మారుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ఆ పార్టీకి సంతృప్తి కలిగించిందేమో కాని మిత్రులు మాత్రం ఒక్కొక్కరుగా దూరమయిపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని బలమైన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకుంది. ఎన్డీఏ నుంచి ఇంకా తప్పుకోనప్పటికీ అది కూడా ఎంతో దూరంలేదన్నది రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వారెవరైనా ఇట్టే చెప్పగలరు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని తెలుగుదేశం పార్టీ అంటుంటే, కనీసం చర్చలు జరపకుండానే పుండుమీద కారం చల్లినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా లేదని ప్రకటన చేయడంతో టీడీపీ కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పుకుంది.
బీహార్ కూ ప్రత్యేకహోదా....
ఇప్పటికే శివసేన వచ్చే ఎన్నికల్లో తాము బీజేపీతో కలిసి పోటీ చేయబోమని తెగేసి చెప్పేసింది. ఇప్పుడు తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కొత్త పల్లవి అందుకున్నారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జనతాదళ్ యూ డిమాండ్ చేయడం కమలనాధులకు తలనొప్పిగా మారింది. ఇటీవలే రాష్ట్రీయ జనతాదళ్ ను వీడి బీజేపీతో జత కట్టారు నితీష్ కుమార్. బీజేపీ సహకారంతోనే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయితే బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీని విడుదల చేయాలని నితీష్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రానికి తలనొప్పే.....
బీహార్ అత్యంత వెనకబడిన ప్రాంతం కావడంతో తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. గతంలో కూడా నితీష్ కుమార్ ప్రత్యేక హోదా బీహార్ కు ఇవ్వాలంటూ అనేకసార్లు ప్రధానిని కోరారు. అయినా ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాపై మాట తప్పినందుకు నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ చేసిన ఈ డిమాండ్ తో కమలనాధులు తలలు పట్టుకుంటున్నారు. కాగా ఇప్పటికే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా ఇక ఏ రాష్ట్రానికి ఇవ్వనని తేల్చి చెప్పారు. ఒక్క ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే సంప్రదాయంగా ఆ హోదా వస్తుందని కూడా స్పష్టం చేశారు. మరి నితీష్ ఏంచేస్తారో చూడాలి.