నితీష్ కు ఊహించని దెబ్బ..!

Update: 2017-12-20 18:29 GMT

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ కుమార్ నాయకత్వాన్ని అంగీకరించలేని జేడీయూ కేరళ అధ్యక్షుడు వీరేంద్ర కుమార్ రాజీనామా చేయడం పార్టీలో సంచలనం కల్గించింది. ఆయన పార్టీతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వీరేంద్రకుమార్ ప్రస్తుతం జేడీయూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఈరోజు తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సమర్పించారు. ఇటీవలే జేడీయూ కీలకనేతలైన శరద్ యాదవ్, ఆలీ అన్వర్ ల రాజ్యసభ సభ్యత్వాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రద్దు చేసిన సంగతి తెలిసిందే. జేడీయూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు వీరు పాల్పడ్డారంటూ జేడీయూ నితీష్ వర్గం లేఖ రాయడంతో వెంకయ్య వారిద్దరి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా జేడీయూ పార్టీని, గుర్తును నితీష్ కే కేటాయించడంతో వెంకయ్య ఈ చర్యలు తీసుకున్నారు.

వారితో కూర్చోలేకే....

అయితే దీనికి మనస్తాపం చెందిన 80 ఏళ్ల వీరేంద్ర కుమార్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ తో నితీష్ కుమార్ చేతులు కలిపి పార్టీ స్థాపించి ఉద్దేశ్యాన్ని మంటగలిపినందుకే తాను రాజీనామా చేశానని వీరేంద్రకుమార్ తెలిపారు. జేడీయూ సభ్యుడిగా తాను నితీస్ కుమార్ వర్గంతో రాజ్యసభలో కూర్చోలేకనే రాజీనామా చేసినట్లు వివరించారు. అయితే వీరేంద్రకుమార్ కు గత ఏడాదే రాజ్యసభ పదవి దక్కింది. అయినా కూడా ఆయన సిద్ధాంతాలను నమ్మి ఆరేళ్లున్న పదవిని తృణప్రాయంగా వదిలేశారని చెబుతున్నారు. మొత్తం మీద ఇది నితీష్ కుమార్ కు ఊహించని దెబ్బే.

Similar News