నిజం చెప్పిన పాపానికి పదవే పోయిందే ...?

Update: 2018-03-18 04:30 GMT

కొందరు నేతలు పందికొక్కుల్లా కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయి ఎలా ప్రజాధనం కొల్లగొడతారో అందరికి తెలిసిందే. పది రూపాయల పనికి వందరూపాయల విలువ టెండర్లతో సాగే బాగోతాలు అక్కడ ఇక్కడ అని కాదు సర్వాంతర్యామి గా అవినీతి భూతం వేళ్ళూనుకుంది. పదవిని బట్టి పైసలు వసూలు చేసుకోవడం కోసమే రాజకీయాలు అంతా ఉపయోగిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించడం రాని వారిని జనంకూడా చేతకానివారుగా జమచేసే రోజులు నడుస్తున్నాయి. ఫక్తు వ్యాపారం కోసమే రాజకీయాలు అనే తీరున కొందరు నాయకులు నడుస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి పదవుల్లోకి రావడం. వచ్చిందే తడవు ఖర్చు పెట్టిన దానికి పదింతలు నొక్కేసి హమ్మయ్య లాభం లో ఉన్నామని భావించే దుస్థితి వ్యాప్తి చెందింది. వార్డ్ మెంబర్ నుంచి ఎంపీల వరకు ఇదే పరిస్థితి రాజకీయాలంటే ప్రజా సేవ కాదు వ్యాపారమే అందరి పరమావధి. ఈ దుస్థితిని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించి పదవికే ఎసరు తెచ్చుకున్నారు ఒక ఛైర్ పర్సన్. అదెలాగా అంటే ...?

ఫ్లో లో కక్కేశారు....

రాజకీయాల్లో వుండే వారిపై ప్రత్యర్ధులు అంత తిన్నారు ఇంత తిన్నారు అని ఆరోపణలు విమర్శలు గుప్పించడం సహజం. వారికి అంత శ్రమలేకుండానే ఒక మీడియా సమావేశంలో నోరు జారీ పదవి పోగొట్టుకున్నారు సిరిసిల్ల మునిసిపల్ ఛైర్ పర్సన్ సామల పావని. పొరపాటున తాము కాంట్రాక్టర్ల నుంచి ఎంత శాతం లంచం తీసుకునేది ఆమె సవివరంగా చెప్పేశారు. కాంట్రాక్టర్లు ఆ డబ్బు ఇచ్చేందుకు చాలా ఇబ్బందులు పెడుతున్నారని దాంతో ఎంతో ఖర్చు పెట్టి పదవుల్లోకి వచ్చిన కౌన్సిలర్లకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని వాపోయారు. కింది స్థాయి నుంచి రాష్ట్రమంతా ఇదే దందా రొటీన్ గా జరిగేదే కదా అని కూడా అనేశారు. మంత్రి కూడా తమవైపే అని మాట్లాడేశారు. ఆమె మీడియా లో ఈ వ్యాఖ్యలు చేశారో లేదో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యూస్ వైరల్ గా మారింది. తెలంగాణ సర్కార్ లో అలజడి మొదలైపోయింది. పావనికి అధిష్టానం చివాట్లు మీద చివాట్లు పెట్టడంతో ఆమెకు ఏమి చేయాలో తోచక తన పదవికి రాజీనామా చేసి గోవిందా కొట్టక తప్పలేదు. అంతపని చేసిన పావని తన రాజీనామా వ్యక్తిగత కారణాలతో చేశానని చెప్పడం కొసమెరుపు. సత్యం మాట్లాడితే హరిశ్చంద్రుడు అంతటి వాడికే పీకల లోతు కష్టాలు వచ్చాయి మరి పావని నిజం చెప్పినా అలాంటి పరిస్థితిని చవిచూశారు పాపం.

Similar News