నిందితుడి ఇంటిముందే మృతదేహం పూడ్చివేత

Update: 2017-02-09 10:06 GMT

హత్యకు గురైన వ్యక్తి మృత దేహాన్ని నిందితుడి ఇంటి ముందు పాతి పెట్టిన ఘటన గుంటూరు లో కలకలం రేపింది. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పేరలి పంచాయతీ మేకలవారిపాలెంలో గొర్రెముచ్చు రవికుమార్‌ హత్య కు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం రవికుమార్‌ మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చారు. మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చిపెట్టకుండా రవికుమార్‌ బంధువులు, గ్రామస్థులు వందల సంఖ్యలో ఆందోళనకు దిగారు. నిందితుడు ఇంటి ముందు ఖననం చేసేందుకు..., పోలీసులను దగ్గరకు రానివ్వకుండా పెద్ద సంఖ్యలో మహిళలు నిలువరించారు.

గ్రామంలో ఉద్రిక్తత....

మృతదేహాన్ని గ్రామంలో పాతిపెట్టడం మంచిది కాదనీ, శ్మశానంలోనే పూడ్చిపెట్టాలనీ మృతుడి బంధువులకు పోలీసులు, పెద్దలు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. నిందితుడు మేకల ఫ్రాంక్లిన్‌ ఇంటిముందే రవికుమార్‌ మృతదేహాన్ని ఖననం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం తండోపతండాలుగా పేరలి గ్రామానికి చేరుకున్నారు. ఫ్రాంక్లిన్‌ ఇంటిముందు పాతిపెట్టిన శవాన్ని వెలికి తీసి శ్మశానంలో పాతిపెట్టేందుకు కొందరు గ్రామపెద్దలు, ప్రజలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై బాపట్ల డీఎస్పీ మహేశను వివరణ కోరగా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొని ఉండటంతో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. సీఐతోపాటు ఏడుగురు ఎస్‌ఐలు, 40 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేశామన్నారు. శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా పెద్దలు చొరవ చూపాలని పేరలి గ్రామస్థులకు డీఎస్పీ మహేష్ విజ్ఞప్తిచేశారు.

Similar News