నాలుక్కరుచుకున్న మంత్రి మాణిక్యం...!

Update: 2018-01-04 06:06 GMT

కొన్ని విష‌యాల్లో తొంద‌ర ఉండాలి. మ‌రికొన్ని విష‌యాల‌ను ఆచి తూచి కానీ స్పందించ‌రాదు!! ఈ లౌక్యం రాజ‌కీయ నేత‌ల‌కు అత్య‌వ‌స‌రం. అయితే, ఏపీ మంత్రి మాణిక్యాల‌రావు ఈ విష‌యంలో ఇంకా ఓన‌మాలు నేర్చుకున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. కార‌ణం.. ఆయ‌న ఏ విష‌యంలో అయితే.. జాగ్ర‌త్త‌గా ఆచి తూచి మాట్లాడాల్సి ఉందో అదే విష‌యంలో తొంద‌ర ప‌డిపోయారు. ''మావోడు మంచోడే!'' అనే రేంజ్‌లో ప్ర‌స్తుతం తీవ్ర వివాదంలో కూరుకుపోయిన గ‌జ‌ల్ శ్రీనివాస్‌ను వెనుకేసుకు వ‌చ్చారు మంత్రి వ‌ర్యులు. అంతేనా.. త‌న‌కు శ్రీనివాస్ చిన్న‌నాటి నుంచి తెలుసున‌ని, మ‌హిళ‌ల జోలికి పోయే కారెక్ట‌ర్ కాద‌ని కూడా మంత్రిగారు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఒక్క‌సారిగా మంత్రి చుట్టూ వివాదాలు, విమ‌ర్శ‌లు మిన్నంటాయి.

వీక్ నెస్ కొంపముంచింది....

కొంద‌రు మ‌హిళ‌లు కూడా నోరు చేసుకునేందుకు రెడీ అయ్యారు. గ‌త మూడు రోజులుగా గ‌జ‌ల్ శ్రీనివాస్ వార్త‌ల్లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఎన్నో క‌ష్ట నష్టాలకు ఓర్చుకుని గ‌జ‌ల్స్ రాయ‌డం, పాడ‌డంలోనూ త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్.. దివంగ‌త జ్ఞ‌న‌పీఠ్ అవార్డ్ గ్ర‌హీత సి.నా.రే(సింగిరెడ్డి నారాయ‌ణ రెడ్డి)కి ఆత్మీయ బంధువు. ఆయ‌న శిష్యుడు. ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంద‌ని, నేటి త‌రం క‌వుల‌కు, సాహిత్యానికి మార్గ‌ద‌ర్శిగా మారుతున్నాడ‌ని అనుకున్నంత‌లో త‌న భ‌విష్య‌త్తును తానే కూక‌టి వేళ్ల‌తో పెక‌లించుకున్న‌ట్టుగా చిన్న వీక్‌నెస్ ఆయ‌న‌ను అతఃపాతాళానికి తొక్కివేసింది!!

కావాలనికుట్ర అంటూ...

''భ‌క్తి వినా'' స‌న్మార్గ‌ము క‌ల‌దే అన్న త్యాగ‌రాజు గారి వాక్కుల‌ను ''ర‌క్తి వినా..''అన్న‌ట్టుగా మార్చుకుని వివాదానికి కేంద్ర బిందువై.. జైలు ప‌క్షిగా మారాడు గ‌జ‌ల్‌. ఆయ‌నపై ఉన్న ప్రేమ చేతో.. లేక వాత్స‌ల్య‌మో మంత్రి ఆయ‌న‌ను వెనుకేసుకు వ‌చ్చారు. కానీ, విష‌యం పెద్ద‌ది కావ‌డంతో వెంట‌నే వెన‌క్కి త‌గ్గారు. తొలుత గజల్ శ్రీనివాస్ పై కావాలని కుట్ర ప్రకారమే ఇలా చేశారని భావిస్తున్నట్లు చెప్పారు. పథకం ప్రకారం రికార్డ్ చేయకపోతే శ్రీనివాస్‌పై అలాంటి వీడియోలు బయటకు ఎలా వస్తాయన్నారు.

మంత్రి వ్యాఖ్యలు వెనక్కు....

గజల్ శ్రీనివాస్ దేశ వ్యాప్తంగా తిరిగి అద్బుతమైన గజల్స్ వినిపించిన వ్యక్తి అని, తనకు చిన్నప్పటి నుంచి శ్రీనివాస్ తెలుసునన్నారు. తర్వాత తప్పు తెలుసుకున్న మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వీడియోలు చూడక ముందు తాను ఈ ప్రకటన చేశానని.. వీడియోలు తనకు వేరే వాళ్ళు పంపితే చూశానని..తర్వాత తన ప్రకటన ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అతని వికృత చర్యలు చాలా బాధించాయని మంత్రి చెప్పుకొచ్చారు. గజల్‌ అనే నాణానికి ఇంతకాలం ఒకవైపే చూశా కానీ, రెండోవైపు కోణం చాలా జుగుప్సాకరంగా ఉంది అంటూ మంత్రి వ్యాఖ్యానించటం విశేషం. మొత్తానికి మంత్రిగారి వ్య‌వ‌హార శైలి.. తీవ్ర వివాదానికి దారి తీసింది.

Similar News