నానో కార్ల లాగా మారిపోయిన జియో సిమ్ లు

Update: 2016-11-11 13:43 GMT

నానో కార్లు అనే వాటిని రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా చాలా సదుద్దేశంతో తీసుకువచ్చారు. స్కూటరు మీద ఒక కుటుంబం అగచాట్లు పడుతూ ప్రయాణించడాన్ని చూసి.. చిన్న కుటుంబాలకు సౌకర్యంగా ఉండడం కోసం నానో కారు తెస్తున్నట్లుగా రతన్ టాటా ప్రకటించారు. అయితే.. కార్ల వినియోగాన్ని ఇష్టపడే మధ్య తరగతి ప్రజల దృష్టిలో నానో కారుకు ఎలాంటి విలువ లేకుండా పోయిందన్నది మార్కెట్ తెలియజెబుతున్న సత్యం. నానో కారు వాడడం అంటే నలుగురి దృష్టిలో చీప్ గా ఉంటుందనే ఉద్దేశం మధ్య తరగతి కి ముద్ర పడిపోయింది. నానో తర్వాతి శ్రేణిలోని ఇతర కంపెనీల కార్లు 3-4 లక్షల రేంజిలో ఉన్నా కొంటున్నారు గానీ.. నానో కు మొగ్గు చూపడం లేదు. నానో కారు అనేది ‘‘ఏదో చీప్’’ అనే సంకేతంలాగా మారిపోయింది.

ఇప్పుడు చూడబోతే రిలయన్స్ వారు ఉచితంగా ఇస్తున్న (డిసెంబరు 31 వరకు) జియో సిమ్ ల పరిస్థితి కూడా అలాగే అయినట్లుగా ఉంది. జియో సిమ్ లను ఉచితంగా ఇస్తుండే సరికి జనం దృష్టిలో వాటికి విలువ లేకుండా పోతోంది. విపరీతమైన రద్దీ కారణంగా జియో సిమ్ లు పనిచేయడంలో వినియోగదార్లకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో.. అసలు ఈ సిమ్ లతో ఎందుకొచ్చిన గొడవలే అని.. ఎటూ ఉచితంగా వచ్చిన సిమ్ కదా.. అని దానికి విలువలేకుండా.. వినియోగదార్లు తీసి పక్కన పడేస్తున్నారు. తిరిగి తాము రెగ్యులర్ గా వాడే ఇతర కంపెనీల సిమ్ లు వేసుకుంటున్నారు.

జియో సిమ్ ను వాడడం అంటే ‘‘వీడు ఫ్రీ గాడు’’ అనే సంకేతంలాగా తయారైపోయినట్లుంది. నగరాలు కొన్ని ప్రాంతాల్లో బాగానే ఉన్నా.. రూరల్ లో కొన్ని ప్రాంతాల్లో జియో సిమ్ లు పనిచేయడం లేదు. మొత్తానికి జియో సిమ్ లు ఫ్రీగా వస్తుండే సరికి వాటికి విలువ లేకుండా పోయిందని.. అవి పనిచేయకపోతే.. ఎలా పనిచేస్తాయో తెలుసుకునే బదులుగా జనం వాటిని తీసి పక్కన పడేస్తున్నారని తెలుస్తోంది.

మొత్తానికి తక్కువ ధరకు ఇస్తున్నందుకు గాను.. నానో కార్లకు విలువ లేకుండాపోయినట్లే, ఉచితంగా ఇస్తున్నందుకు వారొక సదుద్దేశంతో ఇస్తోంటే.. జనం దృష్టిలో మాత్రం అవి పలుచన అవుతున్నాయి.

Similar News