సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి కమలం గూటిలో ఇమడ లేకపోతున్నారా? ఆయన బయటకు వచ్చేయాలని వత్తిడి వస్తుందా? అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సొంత పార్టీ ఒకటి పెట్టుకున్నారు. దాన్ని మూసేసి బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికలలో ఓటమి పాలయిన నాగం జనార్ధన్ రెడ్డి కమలం పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విసుగెత్తిపోయి ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో నెలకొన్న విభేదాలు, జాతీయ పార్టీ పరిశీలకుల పేరుతో ఇక్కడకు వచ్చిన కొందరు నేతలు సంఘ్ పరివార్ కే ఎక్కువప్రాధాన్యం ఇస్తుండటంతో నాగం కినుక వహించారని చెబుతున్నారు. సిద్ధాంతాల పేరుతో రాద్ధాంతం చేయడమే తప్ప ఇందులో తనకు ప్రయారిటీ లేదని నాగం తెలుసుకున్నారు.
కాంగ్రెస్ లోకి వెళ్లాలని....
నాగం గత కొద్దిరోజులుగా ముభావంగానే ఉంటున్నారు. పార్టీ సమావేశాలకు,కార్యక్రమాలకు హాజరవుతున్నా ఆయనకు బీజేపీలో ఉండి చేసేదేమీ లేదని అనిపిస్తోంది. మరోవైపు తన జిల్లాకు చెందిన నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో నాగం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. బీజేపీలో నేతల మధ్య సఖ్యత కొరవడటం, వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను ఢీకొట్టే బలం, బలగం లేకపోవడం తో నాగం బీజేపీలోకి వచ్చి తప్పు చేశానేమోనని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ లోకి వెళితే పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుతో పాటు తన సొంత ఇమేజ్ కూడా కలిసి వస్తుందని ఆలోచిస్తున్నారట. నాగం జనార్థన్ రెడ్డికి బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడుగా నియమించినా ఆ పదవి అలంకారప్రాయమే. అందుకే కమలం పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లాలని నాగం అనుచరులు కూడా తీవ్రంగా వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఏమో.. ఏదైనా జరగొచ్చు....?