నవీన్ ఎందుకంత కసిగా ఉన్నారు?

Update: 2018-02-22 17:30 GMT

ప్రతి ఎన్నికనూ బీజేపీ సీరియస్ గానే తీసుకుంటుంది. ఒడిషాలో జరుగుతున్న బిజెపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 24వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికార పార్టీ బిజూ జనతాదళ్, బీజేపీలు తీవ్రంగా శ్రమించాయి. నేటితో ఇక్కడ ప్రచారం కూడా ముగిసింది. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ నియోజకవర్గంలో పర్యటించడం విశేషం. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని నవీన్ కసితో ప్రచారం చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ, బిజేడీలు భావిస్తున్నాయి. బీజేపీ తరుపున కే్ంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఈ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం విశేషం.

వెనుకబడిన నియోజకవర్గం....

బిజెపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బరపల్లి, బిజెపూర్, గాయ్ సిలేట్, బరపల్లి సమితులున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు, చేనేత కార్మికులు ఉన్నారు. ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం లేదు. పక్కనే అంగనది ఉన్నా చుక్కనీరు రాక పంట చేతికి రావడం లేదు. దీంతో రైతాంగం తీవ్ర నిరాశలో ఉంది. అలాగే చేనేత కార్మికులపై ఇటీవల విధించిన జీఎస్టీ భారం పడింది. దీంతో ఈ రెండు వర్గాల వారూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకోసమే నవీన్ పట్నాయక్ ఈ నియోజకవర్గంలో రెండురోజుల పాటు పర్యటించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

మంత్రివర్గమంతా ఇక్కడే....

బిజూ జనతాదళ్ తరుపున మొత్తం ప్రచారంలో 12 మంది మంత్రులు, పది మంది ఎంపీలు, 60 మంది ఎమ్మెల్యేలు పాల్గొనడం విశేషం. బిజెపూర్ ఉప ఎన్నిక వస్తుందని తెలియగానే ఈ నియోజకవర్గానికి 1240 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. బీజేపీ చెబుతున్న మాటలకు లొంగిపోవద్దని స్వయంగా నవీన్ ఓటర్లను కోరారు. అయితే బిజెపూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నవీన్న పట్నాయక్ పై ఒక యువకుడు చెప్పు విసిరారు. అతని వద్ద బీజేపీ జెండాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ముఖ్యమంత్రిపై దాడి చేయడంలో బీజేపీ కుట్ర ఉందన్న ప్రచారం జోరుగా చేస్తోంది.

బీజేపీ ప్రధాన పోటీ.....

ఇటీవల స్థానికసంస్థల ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేవారు. మరో కేంద్రమంత్రి జోయల్ కూడా బిజెపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆరుగురు కేంద్రమంత్రులు ఈ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు.ఇక్కడ ప్రధానంగా పోటీ బిజూ జనతా దళ్, బీజేపీ మధ్యనే ఉందన్నది విశ్లేషకుల అంచనా. ఒడిషాలో శనివారం జరగనున్న ఉప ఎన్నిక ఉత్కంఠ ను రేపుతోంది. శనివారం జరగనున్న ఈ ఎన్నికలో ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందో చూడాలి మరి.

Similar News