మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో పార్టీలో అసంతృప్తులు లేకుండా చూసుకుంటున్నారు. ఆయన టీడీపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు చంద్రబాబు సమక్షంలో అమరావతిలో నల్లారి చేరనున్నారు. దీంతో ఆయన పీలేరు నియోజకవర్గంలోని టీడీపీలో అసంతృప్తులు చెలరేగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అదే ఎన్నికల్లో టీడీపీ తరుపున డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆయన నియోజకవర్గంలో తిరుగుతూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
టీడీపీ నేతలను కలిసి....
ఈ నేపథ్యంలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి డాక్టర్ ఇక్బాల్ ఇంటికి వెళ్లారు. తనకు సహకరించాలని కోరారు. ఆయనతోపాటు ఆయన కుమారుడు అమర్ నాధ్ రెడ్డి కూడా ఇక్బాల్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. ఈనెల 23వ తేదీన తనతోపాటు అమరావతికి రావాలని కిశోర్ కుమార్ రెడ్డి ఇక్బాల్ అహ్మద్ ను కోరారు. ఇటీవల చంద్రబాబును కలిసినప్పుడు నియోజకవర్గంలో అందరినీ కలుపుకు పోవాలని చెప్పడంతో నల్లారి నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్యనేతలందరినీ కలిసే పనిలో పడ్డారు. డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ మూడున్నరేళ్ల నుంచి నియోజకవర్గంలో కష్టపడుతున్నందున ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో పీలేరు టీడీపీ టిక్కెట్ ఎలాగూ నల్లారి కుటుంబానికే వెళుతుంది కాబట్టి ఇక్బాల్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు తెలిసింది. మొత్తం మీద నల్లారి తన నియోజకవర్గంలో టీడీపీలో చేరే ముందే అసంతృప్తి గళం విన్పించకుండా జాగ్రత్త పడుతున్నారన్నమాట.