పీలేరు లో ఆ ఓట్లు ఎవరివి? ఇప్పుడు ఇదే టాపిక్. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి పీలేరుకు అవినాభావ సంబంధముంది. ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబానికి ఒక ఓటు బ్యాంకు ఉందనడంలో సందేహం లేదు. దాదాపు మూడున్నరేళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాపనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండటంతో అభివృద్ధి పనులన్నింటినీ సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి చూసుకునేవారు. కిశోర్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా అందుబాటులో ఉండటంతో అక్కడి కార్యకర్తలకు గాని, అనుచరులకు గానీ ఆయనే బాస్. అయితే కేవలం పీలేరు నియోజకవర్గంలోనే కాదు పుంగనూరు, తంబళ్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాల్లోనూ నల్లారి కుటుంబానికి బంధువర్గంతో పాటు అనుచరగణం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే నల్లారి కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకునేందుకు చంద్రబాబు ఉత్సాహం చూపారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరకపోయినా... ఆయన సోదరుడు చేరితే చాలనుకున్నారు.
ముస్లిం ఓటర్లు ఎటువైపు?
అందుకే కిశోర్ కుమార్ రెడ్డికి వెంటనే నామినేటెడ్ పదవి, ఆయన కుమారుడు అమర్ నాధ్ రెడ్డికి పీలేరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామన్న ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి మంత్రి అమర్ నాథ్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించారని చెబుతున్నారు. అయితే నల్లారి కుటుంబానికి పీలేరు నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నాు. దాదాపు 70 వేల ముస్లిం ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ ఓట్లన్నీ నల్లారి కుటుంబానికే ఉండేవి. అయితే గత ఎన్నికల్లో మాత్రం ఆ ఓట్లు వైసీపీకి పడ్డాయి. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మాత్రం ముస్లింలు తమ వెంటే ఉంటారని టీడీపీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. అయితే టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటే ముస్లిం ఓట్లు గంప గుత్తగా నల్లారి కుటుంబానికి ఎలా పడతాయన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. తొలి నుంచి ఆ ఓట్లు టీడీపీ వ్యతిరేకంగానే ఉంటున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఆ ఓట్లు వేశారని, తనకు విజయం దక్కదని భావించే ఆ ఓట్లు వైసీపీకి వెళ్లాయని కిశోర్ కుమార్ చెబుతున్నారు. అయితే ఈసారి టీడీపీకి గంపగుత్తగా పడతాయని చెబుతున్నారు. మొత్తం మీద మూడు నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉన్న నల్లారి కుటుంబాన్ని నారా వారు దగ్గరకు తీయడం చిత్తూరు జిల్లాలో మరింత బలం పెంచుకోవడానికేనన్నది స్పష్టమవుతోంది.