నల్లగొండ ఉప ఎన్నిక ఇక తప్పదని ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ కూడా అప్రమత్తమయింది. ఒకప్పుడు గట్టి ఓటు బ్యాంకు ఉన్న నల్లగొండ జిల్లాలో మళ్లీ తన పట్టును పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. నల్లగొండ ఉప ఎన్నికలు వస్తే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఇందుకు రేవంత్ రెడ్డి కూడా అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని ప్రకటించారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు అందుకు అభ్యంతరం చెప్పారని తెలిసింది. నల్లగొండ జిల్లాలో ఎవరూ నేతలే లేనట్లు రేవంత్ ను పోటీకి దింపితే తప్పుడు సంకేతాలు వెళతాయని, నల్లగొండ జిల్లా నేతలనే బరిలోకి దించాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో నల్లగొండ ఉప ఎన్నికలొస్తే ఎవరిని బరిలోకి నిలపాలా? అన్న దానిపై కసరత్తులు చేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ చివరకు ఉమా మాధవ రెడ్డి అయితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఆమె అయితే మద్దతిస్తామన్న బీజేపీ.......
ఉమా మాధవరెడ్డి అయితే తాము కూడా మద్దతిస్తామని బీజేపీ చెబుతోంది. ఈ మేరకు బీజేపీ, టీడీపీ నేతల మధ్య కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఎలిమినేటి కుటుంబానికి నల్లగొండ జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. పైగా పదిసార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే నల్లగొండ పార్లమెంటు నుంచి గెలిచారు. అయితే ఉమా మాధవరెడ్డి మాత్రం ఈ పోటీకి అంత సముఖంగా లేరని తెలుస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడికి భువనగిరి బాధ్యతలు అప్పబెబుదామనుకుంటున్నానని, తనను ఈ ఉప ఎన్నికల బరిలోకి లాగొద్దని ఉమా మాధవరెడ్డి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఉమా మాధవరెడ్డికి సౌమ్యురాలిగా పేరుండటం, ఎలిమినేటి కుటుంబానికి పట్టు ఉన్న కారణంగా ఎలాగైనా ఉమా మాధవరెడ్డిని బరిలోకి దించాలని టీటీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చేత నేరుగా ఉమామాధవరెడ్డితో మాట్లాడించాలని నిర్ణయించారు. ఉమా మాధవరెడ్డి అయితే బీజేపీ కూడా మద్దతిస్తుందన్న విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లి ఆమెనే బరిలోకి దించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఉప ఎన్నిక అంటూ వస్తే.... పోటీ చేయడానికి ఉమా మాధవరెడ్డి అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.