నరహంతకుడు నయీమ్ హతం అయ్యాడనుకుంటే... నయీం అనుచరుడే ముఠానాయకుడిగా ఎదిగాడా? నయీం చేసిన దందాలు, టెక్నిక్ లు తెలిసిన గ్యాంగ్ లో నెంబర్ 2 గా ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నయీం ఎన్ కౌంటర్ లో చనిపోయిన తర్వాత బాధితులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎన్ని దందాలు...ఎన్ని భూ ఆక్రమణలు...పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో చెలరేగిపోయిన నయీంను మట్టుపెట్టి ఇక నిశ్చింతగా నిద్రపోవచ్చని పోలీసులు చెప్పేశారు. కాని క్రిమినల్ నయీం గ్యాంగ్ లో కీలక వ్యక్తి అయిన పాశం శ్రీను నయీంకు కొనసాగింపుగా దందాలకు తెరలేపారు. జైల్లోనుంచే సెటిల్ మెంట్లు చేస్తున్నాడు.
పోలీసులనే వాడుకుంటూ.....
నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతని ప్రధాన అనుచరులైన పాశం శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. నయీంగ్యాంగ్ లో పాశం శ్రీను నెంబర్ 2గా ఉండేవాడు. నయీం చెప్పిన పని చెప్పినట్లు చేసే పాశం శ్రీనుకు దందాలు కొట్టిన పిండి. దీంతో పాశం శ్రీనుపై పీడీ యాక్టు పెట్టి వరంగల్ జైల్లో పెట్టారు. వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న పాశం శ్రీను జైలునుంచి తన పాత దందాకు తెరలేపాడు. భువనగిరి ప్రాంతాన్ని తన అడ్డాగా చేసుకున్నాడు. కోర్టు కేసుల నిమిత్తం పాశం శ్రీనును నెలలో రెండు సార్లు వరంగల్ నుంచి హైదరాబాద్ కు పోలీసులు ఎస్కార్ట్ తో తీసుకొచ్చే వారు. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్ పోలీసులను పాశం శ్రీను మచ్చికచేసుకున్నాడు. తనను కోర్టు వాయిదాలకు తీసుకొచ్చే ముందు అనుచరులకు కబురు పంపేవాడు. వాళ్లు పాశం శ్రీను తమ్ముడు అమర్ తో సహా అతని టీం పెంబర్తి దాబా వద్ద సిద్ధంగా ఉండేది. ఎస్కార్ట్ పోలీసులతో సహా అక్కడ ఆగి తాపీగా భూ సెటిల్ మెంట్లు చేసేవాడు పాశం శ్రీను. ఇందుకు పెద్దమొత్తంలో ఎస్కార్ట్ పోలీసులుకు నగదు ముట్టేది. వారి ఫోన్ల నుంచే అందరితో తాపీగా ఫోన్ మాట్లాడేవాడు పాశం శ్రీను.దాదాపు మూడు నాలుగు నెలలుగా సాగుతున్న ఈ దందా రాచకొండ పోలీస్ కమిషనర్ కు తెలిసిపోయింది. దీంతో గట్టి నిఘా పెట్టారు. చిక్కిపోయారు. పాశం శ్రీనుకు సహకరించిన ఇద్దరు ఎఆర్ ఎఎస్ఐలుఖాజా ,రమేశ్ లతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ,ఒక హోంగార్డును సస్పెండ్ చేసారు ఉన్నతాధికారులు. పాశం శ్రీను మరో నయీం కాకముందే అతని ఆగడాలకు చెక్ పెట్టాలని భువనగిరి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మొత్తం మీద నయీం ఎన్ కౌంటర్ లో మృతి చెందాడని తేరుకుంటున్న బాధితులకు పాశం శ్రీను రూపంలో హెచ్చరికలు వస్తుండటంతో మరికొంత మంది పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు.