నయనతార ఫొటోతో దొంగను పట్టుకున్నారు!

Update: 2017-12-24 01:52 GMT

బిహార్‌ పోలీసులు చాలా వినూత్నంగా ఓ నేరస్థుడ్ని పట్టుకున్నారు. దక్షిణ చిత్ర పరిశ్రమకు చెందిన కథానాయిక నయనతార ఫొటో ఉపయోగించి ఆ నేరస్థుడ్ని పట్టుకోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. బిహార్‌ రాష్ట్రం దర్బాంగా జిల్లాకు చెందిన భాజపా నాయకుడు సంజయ్‌ కుమార్‌ సెల్‌ఫోన్‌ను మహ్మద్‌ హసైన్‌ అనే నేరస్థుడు దొంగిలించి పారిపోయాడు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీనియర్‌ పోలీసు అధికారిణి మధుబాలా దేవి అతని కాల్‌ డేటా రికార్డును ట్రేస్‌ చేశారు. మహ్మద్‌ ఇంకా ఫోన్‌ను వినియోగిస్తున్నాడని నిర్ధారించుకున్నారు.

ప్రేమిస్తున్నట్లు చెప్పి....

మధుబాలా దేవి నేరస్థుడికి ప్రపోజ్‌ చేసి, ప్రేమిస్తున్నట్లు నటించారు. ఓ అమ్మాయిలా అతడికి సందేశాలు పంపారు. తొలుత అతడు సందేశాలకు స్పందించలేదు. కొన్ని రోజుల తర్వాత స్పందించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోను పంపించాలని అడిగాడు. దీంతో ఆమె తెలివిగా సినీ తార నయనతార ఫొటోను పంపించారు. ఎంతో సంతోషించిన దొంగ, ఆమెను కలవడానికి ఓ రోజును ఫిక్స్‌ చేశాడు. ఓ ప్రదేశానికి రమ్మని చెప్పాడు. పోలీసు అధికారులు సాధారణ వ్యక్తుల్లా దుస్తులు ధరించి, ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ముధుబాలా దేవి ముసుగు ధరించి అతడి వద్దకు వెళ్లారు. నేరస్థుడు ఆమెను గుర్తించలేకపోయాడు. ఆమె వెంటనే అతడ్ని పట్టుకుని, అదుపులోకి తీసుకుంది. మధుబాలా దేవి కేసును విచారించి, దొంగను పట్టుకున్న తీరు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు స్థానిక భాజపా నాయకులు ఆమెను ప్రశంసించారు.

Similar News